Tuesday, 3 November 2026

మాజీ ప్రధాని హంతకుల్ని విడుదల చేస్తే సామాన్యులకు రక్షణెక్కడిది? : రాహుల్‌


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి) :
మాజీ ప్రధాని, రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులను విడిచిపెట్టాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఓ మాజీ ప్రధానిని చంపేసినవారినే వదిలివేస్తే ఇక సామాన్య పౌరులు న్యాయం ఎలా ఆశిస్తారని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజీవ్‌ హత్యకేసు ముద్దాయిలను ఏడుగురిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మరణశిక్షకు తాము వ్యతిరేకమని, అయితే ప్రధానిని చంపినవారు ఇలా స్వేచ్ఛపొందవచ్చా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్‌ వ్యాఖ్యల తర్వాత కొద్ది సేపటికే కాంగ్రెస్‌ పార్టీ జయలలిత చర్య బాధ్యతారహితమని, ఎన్నికల స్టంటని ప్రకటించడం గమనార్హం. ఇదిలావుంటే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎం.జి.పెరారివాలన్‌, నళిని సహా ఏడుగురు దోషులు విడుదల కానున్నారు. బుధవారం ముఖ్యమంత్రి జయలలిత నాయకత్వంలో అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. మరణశిక్ష అమలులో తీవ్రమైన జాప్యం జరిగిన అంశాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. రాజీవ్‌ హంతకులకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్పు చేయడంతో పాటు- ఇప్పటికే 23 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన దృష్ట్యా రెమిషన్‌ ఇచ్చి విడుదల చేసే నిర్ణయాధికారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి ఇచ్చింది. వెంటనే స్పందించిన డిఎంకే, ఎండిఎంకే, సిపిఐలు వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశాయి. పార్లమెంట్‌ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తమిళనాడులో రాజకీయ లబ్ధి పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్‌ నిరసన వ్యక్తం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *