
కన్నా, ఉత్తమ్ పేర్లు పరిశీలనలో..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందే కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షులను నియమించడం ద్వారా ఎన్నికలకు సన్నద్దం చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర విభజన సమస్య తీరిన తరువాత వచ్చే ఎన్నికల్లో ఎలా గట్టేక్కాలని ఇప్పటి నుండే కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటుకన్నా ముందుగా సారధులను నియమించాలని హైకమాండ్ పెద్దల ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. పిసిసిలను నియమించే ఆలోచన ఉన్నట్లు కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్‌సింగ్ చేసిన సూచన ఇక్కడ గమనార్హం. అలాగే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కాకుండా ముఖ్యమంత్రిని నియమించాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రాష్ట్రానికి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు కన్నా లక్ష్మీనారాయణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షులను నియమించాలని కాంగ్రెస్ భావించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆంధప్రదేశ్ రాష్ట్రానికి కన్నా లక్ష్మీ నారాయణ, తెలంగాణ ప్రాంతానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించాలని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతం నుండే డి.శ్రీనివాస్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కన్నాను నియమించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాపులను బీసీల్లో చేర్చాలని తాను సోనియాను కోరడం జరిగిందని..అంతేకాని ఎలాంటి ఇతర అంశాలు చర్చకు రాలేదని సోనియాను కలసిన అనంతరం కన్నా విూడియాతో పేర్కొన్నారు. కర్ణాటకలో అమలు చేసిన ఫార్ములాను ఇక్కడ అమలు చేయాలని సోనియాను కన్నా కోరినట్లు సమాచారం. కాపులను బిసి జాబితాలో చేర్చడంపై సోనియా గాంధీ వివరాలు అడిగారని, గణాంకాలతో కూడిన వివరాలను తాను అందించానని కన్నా లక్ష్మీనారాయణ భేటీ అనంతరం విూడియాతో చెప్పారు. బీసీలకు ప్రోత్సాహం అందిస్తే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుందని కన్నా పేర్కొనట్లు తెలుస్తోంది. తమ భేటీలో సీఎం రాజీనామా.. కొత్త సీఎం.. రాష్ట్రపతి పాలన వంటి విషయాలు చర్చకు రాలేదని కన్నా చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సీఎం పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తినే సీఎంగా నియమించాలని అధిష్టానంపై తీవ్ర వత్తిడి తెలుస్తున్నారు. గతంలో సీఎం కిరణ్ మారుస్తారన్న ప్రచారం జరిగినప్పుడు కన్నాను ముఖ్యమంత్రిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. పలుమార్లు అధిష్టానం పెద్దలతో కన్నా భేటీ కావడం దానికి బలం చేకూర్చినట్లైంది. కొత్త సీఎం ఎంపిక విషయంలోనే తాజాగా సోనియాతో కన్నా భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ రాజీనామా చేసిన కిరణ్ కొత్త పార్టీ పెట్టినా ఆ పార్టీలోకి ఎవరు వెళ్లకుండా అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులోభాగంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. రాష్ట్ర విభజన ఖాయమైన నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇరు ప్రాంతాలకు వేర్వేరు పిసిసిలను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టినట్లు వీరితో చర్చించన తరవాత అర్థమవుతోంది. వారితో సోనియా గాంధీ అర గంట పాటు సమావేశమయ్యారు.రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం కన్నా కొత్త ముఖ్యమంత్రిని నియమిస్తే మంచిదని కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్టాన్రికి తొలి ముఖ్యమంత్రి దళితుడు అవుతారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారని, ఆ దిశగా ముందుగానే కాంగ్రెసు అడుగులు వేస్తే బాగుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి సోనియాకు చెప్పినట్లు సమాచారం. తాజా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ముఖ్యమంత్రిని చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పరోక్షంగా సూచించినట్లు భావిస్తున్నారు. తెలంగాణ నేతలు రాష్ట్రపతి పాలన విధింపునకు వ్యతిరేకంగా ఉన్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఢిల్లీలో సందడి చేస్తున్నారు. వారు జివోఎం సభ్యుడు జైరాం రమేష్‌తో బేటీ కానున్నారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలుస్తున్నారు. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.మరోవైపు ఆంధప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధింపుపై కాంగ్రెస్ అధిష్టానం విముఖంగా ఉంది. వీలైతే రెండు ప్రభుత్వాలను, లేదంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా యోచిస్తోంది. ముఖ్యమంత్రి రాజీనామాతో తలెత్తిన పరిస్థితులు, విభజనకు సంబంధించి రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్, అపాయింటెడ్ డే వంటి కీలకాంశాలను తేల్చాల్సి ఉన్నందున రాజకీయ వ్యూహంతో అడుగులు వేస్తోంది. కిరణ్ స్థానంలో కన్నా లక్ష్మీనారాయణ ఎంపిక జరుగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక గవర్నర్ నివేదిక మేరకు రాష్ట్రపతి పాలన విధించాలా, అపాయింటెడ్ డే నిర్ణయమయ్యేదాకా అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన కొనసాగించడమా, సీమాంధ్ర నేతలను సంతృప్తి పరచే ప్రయత్నాల్లో భాగంగా విభజన పక్రియ పూర్తయ్యేదాకా ఆ ప్రాంతానికి చెందిన మరో నేతను సీఎం చేయడమా అనేదానిపై కాంగ్రెస్ తర్జనభర్జన పడుతోంది.
రెండు ప్రాంతాలకు కొత్త పీసీసీలు?




