లేదంటే జై రాయలసీమ : టీజీ
కర్నూలు, ఫిబ్రవరి 22 (జనంసాక్షి) :
అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలే రాజధాని చేయాలని, లేనిపక్షంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని మాజీమంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. కర్నూలుకు రాజధాని చేయడమో రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయడమో కేంద్ర ప్రభుత్వం తేల్చుకోవాలని అన్నారు. తెలుగువారందరూ కలిసి ఉండటం కోసం 1956లో కర్నూలు నుంచి రాజధానిని త్యాగం చేశామని, ఇకపై త్యాగాలు చేసే పరిస్థితిలో రాయలసీమ ప్రజలు లేరన్నారు. 1953 నాటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశామని చెబుతున్న కేంద్రం 1956 నాటి రాజధానిని కర్నూలులో ఎందుకు ఏర్పాటు చేయరని ప్రశ్నించారు. కర్నూలులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కర్నూలు కోసం ఇక ఉద్యమిస్తామని అన్నారు. రాజధాని ఇవ్వకపోతే ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అయిపోయిన నేపథ్యంలో కర్నూలు నగరాన్ని అంధప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ కేంద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలును రాజధానిగా చేయడం వల్లే తమ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని అన్నారు. లేకుంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని చేపట్టవలసి ఉంటుందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు. కేవలం ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆరోపించారు. అజెండాలో రాష్ట్ర విభజన అంశాన్ని చేర్చి ఆమోదం చేస్తే తాము గౌరవంగా తప్పుకునే వారమని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం డ్యాం నుంచి నీటిని తీసుకుని తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. తమ ప్రాంతం మాత్రం ఏడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమలో వజ్రాలు, బంగారు గనులు అపారంగా ఉన్నాయని వెంకటేష్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగినందున ఇకనుంచి మేం ఎవరి మోచేతి నీళ్లు తాగి బతకాలో అని బాధగా ఉందని అన్నారు. ఎన్నికలు ముందు రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని విభజించారన్నారని పేర్కొన్నారు. సీమాంధ్ర రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని తద్వారానే న్యాయం జరుగుతుందని అన్నారు. రాజధానిని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయకపోతే ప్రత్యేక రాయలసీమలో తమ బతుకేదో తాము బతుకుతామని ఆయన అన్నారు. ఇదిలావుంటే కర్నూలును ఆంధప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా చేయాలని, లేకపోతే సత్యాగ్రహం చేస్తానని మాజీ మంత్రి మారెప్ప శుక్రవారం హైదరాబాదులోని సచివాలయంలో హెచ్చరించారు. ఆంధప్రదేశ్ రాజధానిని కర్నూలులో పెడితే సోనియాకు గుడి కడతామని చెప్పారు. ఇదిలావుంటే, సీమాంధ్రకు తిరుపతిని రాజధానిగా చేయాలని కోరుతూ ఎంపీ చింతామోహన్ శుక్రవారం ప్రధాని మన్మోహన్సింగ్ను కలసి వినతిపత్రం ఇచ్చారు. మరోవైపు గతంలో కోల్పోయిన రాజధానిని తిరిగి రాయలసీమలోనే ఏర్పాటు- చేయాలని, లేనిపక్షంలో పోరాటాలు చేస్తామని రాయసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖ్‌రెడ్డి హెచ్చరించారు. ప్రత్యేక ప్యాకేజీలతో రాయలసీమకు ఒరిగేదేమీ లేదన్నారు. రాయలసీమలో రాజధాని కోసం ఈ నెల 24, 25 తేదీల్లో అన్ని జిల్లాల్లో దీక్షలు చేపడతామని చెప్పారు.
అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలే రాజధాని





