Tuesday, 3 November 2026

బీహార్‌లో లాలూపార్టీకి షాక్‌


నిలువునా చీలిన ఆర్జేడీ
జేడీ(యూ)లో విలీనం
మా సంతకాలు ఫోర్జరీ ఆరుగురు ఎమ్మెల్యేల ఆరోపణ
పాట్నా,ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : ఇంతకాలం సౌమ్యుడిగా, కేవలం అభివృద్దికి మాత్రమే కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న బీహార్‌ సిఎం నితీష్‌ కుమార్‌ తన తదుపరి రాజకీయ క్రీడను ప్రారంభించారు. బిజెపి మద్దతుతలో గెలిచాక తొలిసారి ఆ పార్టీని ప్రభుత్వం నుంచి
పక్కన పెట్టి సొంతంగా పీఠాన్ని పదిల పర్చుకున్న నితీష్‌ ఎన్‌డిఎ నుంచి వైదొలిగారు. మోడీ ప్రధాని అభ్యర్థిగా తెరపైకి రావడంతో ఆయన తన అక్కసును వెళ్లగక్కారు. దీంతో బీహార్‌లో ఇప్పుడు జెడియూ ఏకఛత్రాధిపత్యం సాగిస్తోంది. అయితే బిజెపి ఎమ్మెల్యేలను చీల్చేందుకు ఆయన చేసిన ప్రయత్నం వికటించింది. బిజెపి అప్రమత్తం కావడంతో ఆ ప్రయోగాన్ని ఇప్పుడు ఆర్జేడీ పై ప్రయోగించారు. దాని అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు బీహార్‌లో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలేలా చేశారు. లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. ఆ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక కూటమిగా ఏర్పడ్డారు. తమను ప్రత్యేక కూటమిగా గుర్తించాలని సభాపతికి లేఖ ఇచ్చారు. ఈ లేఖను స్పీకర్‌ అంగీకరించినట్లు సమాచారం. వీరంతా జేడీయూలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా తెరవెనక ఉండి నితీష్‌ నడిపిన వ్యవహారంగా తెలుస్తోంది. అయితే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ నుంచి బయటకు వచ్చామనే వార్తలను ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఖండించారు. తమ సంతకాలను ఫోర్జరీ చేశారని వారు తెలిపారు. ఆర్జేడీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి వేరుకుంపటి పెట్టినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లాలా గడ్డి స్కాంంలో ఇరుక్కుని జైలుకు వెళ్లాక ఆయన ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. లాలూ బెయిల్‌పై వచ్చినా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో దీనిని ఆసరా చేసుకుని ఆర్జెడి పుట్టి ముంచే ప్రయత్నాల్లో నితీష్‌ విజయం సాధించారు. మొత్తానికి దీనితో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు షాక్‌ తగిలింది. సోమవారం 13 మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా ఒక ప్రత్యేక కూటమిగా ఏర్పడ్డారు. తమను ప్రత్యేక కూటమిగా గుర్తించాలని ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ కు లేఖ రాశారు. వీరంతా బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ (జేడీయూ)లో చేరనున్నట్లు- సమాచారం. 2010 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 243 స్థానాలకు ఆర్జేడీ 22 స్థానాలు కైవసం చేసుకోగా నితీష్‌ కుమార్‌ 115 సీట్లను. బిజెపి 91 స్థానాల్లో విజయం సాధించింది. తరువాత నితీష్‌ బిజెపితో తెగదెంపులు చేసుకున్నారు. గత సంవత్సరం జూన్‌ నెలలో మోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం జేడీయూ బిజెపికి దూరంగా ఉంది. నేను కాంగ్రెస్‌ తోనే ఉంటానని ఇటీవలే ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో బీహార్‌ లో కాంగ్రెస్‌, ఆర్జేడీ, ఎల్‌ జేపీ ల మధ్య పొత్తు కుదిరిందని ఎల్‌ జేపీ నేత రాంవిలాస్‌ పాశ్వాన్‌ గతంలో పేర్కొన్నారు. 2004సంవత్సరంలో ఆర్జేడీ కాంగ్రెస్‌ మధ్య పొత్తులు కుదిరాయి. కాంగ్రెస్‌, లోక్‌ జనశక్తి, ఆర్డేడీ కలసి 24 ఎంపీ సీట్లు గెలుచుకున్నాయి. 2009లో మాత్రం ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా మారిపోయారు. ఒంటరిగా పోటీ- చేసి ఘోరంగా దెబ్బతిన్నారు. ఆర్జేడీ నాలుగు, కాంగ్రెస్‌ రెండు గెలుచుకోగా ఎల్‌ జేపీ అకౌంట్‌ ఓపెన్‌ చేయలేదు. దీనితో ఈసారి ఎన్నికల్లో
మాత్రం అలాంటి పరిస్థితి రావద్దని ఆయా పార్టీలు నిర్ణయానికొచ్చినట్లు- సమాచారం. అందులో భాగంగానే లాలూ కాంగ్రెస్‌ తో టచ్‌ లో ఉన్నట్లు- తెలుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్‌, ఎల్‌ జేపీ తో కలిసి బీహార్‌, జార్ఖాండ్‌ లలో సెక్యులర్‌ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా లాలూకు 13మంది ఎమ్మెల్యేలు ఝలక్‌ ఇవ్వడం..వీరంతా నితీష్‌ తో వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం. బీహార్‌ లో ఎలాంటి పరిణామాలు చోటు- చేసుకుంటాయో వేచి చూడాల్సింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *