న్యూఢిల్లీ: నేటి నుంచి గ్యాస్ డీలర్లు నిరవధిక సమ్మెకు దిగాలన్న ప్రతిపాదనను విరమించుకున్నట్లు గ్యాస్ డీలర్ల అసోసియేషన్లు ప్రకటించాయి. తమ సమస్యలు, ఇబ్బందులు పరిష్కరించేందుకు ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు జాయింట్ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఒప్పుకున్నాయని తెలిపాయి. ఇంధన సంస్థలు ప్రవేశపెట్టిన కఠనతర క్రమశిక్షణ మార్గదర్శకాలను వ్యతిరేకిస్తూ ఫెడరేషన్ ఆఫ్ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్‌లు సమ్మెకు పిలుపునిచ్చాయి. సమస్యల పరిష్కారం కోసం ఇరు వర్గాల సభ్యులతో ఏర్పాటయ్యే కమిటీ మార్చి 31లోగా నివేదిక సమర్పించనుందని ఆల్‌ఇండియా ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ చంద్ర ప్రకాశ్ తెలిపారు.




