Thursday, 5 November 2026

76వేల ఎకరాలకు నీరందించాలి

 గేట్లన్నీంటిని ఆపరేషనలైజ్‌చేసి సిద్ధంగా ఉంచండి
మిడ్‌ మానేరుపై అధికారులతో మంత్రి హరీశ్‌రావు సవిూక్ష
హైదరాబాద్‌, జూన్‌21(జ‌నం సాక్షి) : మిడ్‌మానేరులో గత ఏడాది 5 టీఎంసీల నీరు నింపామని, ఈ ఏడాది 25 టీఎంసీల నీరు నింపే అవకాశం ఉందని, తద్వారా ఈ ప్రాజెక్టు కింద ప్రత్యక్షంగా 76వేల ఎకరాలకు నీరందించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులకు సూచించారు. గురువారం సచివాలయంలో మిడ్‌ మానేరుపై మంత్రి  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు కింద ప్రత్యక్షంగా 76 వేల ఎకరాలకు నీరందిస్తామని చెప్పారు. గేట్లన్నింటినీ ఆపరేషనలైజ్‌ చేసి సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. ఫ్లడ్‌ కంట్రోల్‌ రూం పనులపై మంత్రి ఆరా తీశారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్యాకేజీల వారీగా పనులు జరుగుతున్న తీరును ఇంజినీర్లను మంత్రి అడిగి తెలుసుకున్నారు. లింక్‌ కెనాల్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు మంత్రి. మిడ్‌ మానేరు ద్వారా ఎన్ని చెరువులు నింపవచ్చునో ఆ వివరాలను పంపాలని అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. మిడ్‌ మానేరు పునరావాస చర్యల కోసం రూ. 33 కోట్లకు ఆథరైజేషన్‌ పెండింగ్‌ ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అప్పటికప్పుడు హరీశ్‌ రావు ఆర్థికశాఖ అధికారులతో మాట్లాడి ఆథరైజేషన్‌ పక్రియను పూర్తి చేయించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఈఎన్‌సీ హరిరామ్‌, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంజినీర్లు పాల్గొన్నారు.