29న ఏపీ బంద్‌కు వైసీపీ పిలుపు
ఉక్కు ఫ్యాక్టరీ సాధనకోసం అందరూ బంద్‌లో పాల్గొనాలి
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి
కడప, జూన్21(జనం సాక్షి) : కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 29న ఆంధప్రదేశ్ రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి గురువారం ప్రొద్దుటూరులో ప్రకటన చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 23న కడప, 24న బద్వేల్, 25న రాజంపేటల్లో వైఎస్సార్ సీపీ ధర్నాలు చేస్తుందని వెల్లడించారు. 26న జమ్మలమడుగులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకూ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. 27న రహదారుల దిగ్భంధం, 29న రాష్ట్ర బంద్ చేపడతామని వివరించారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో బీజేపీ-టీడీపీలు ఉక్కు ఫ్యాక్టరీ ఊసేత్తలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి టీడీపీ మాట్లాడుతోందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ ఉక్కు ఫ్యాక్టరీని డిమాండ్ చేస్తోందని చెప్పారు. మరోవైపు చంద్రబాబు తన తప్పిదాలను బీజేపీపైకి నెడుతున్నారని పేర్కొన్నారు.
బంద్‌కు సిపిఐ మద్దతు
కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం పోరాటం ఉధృతం చేస్తామని సీపీఐ నేత రామకృష్ణ స్పష్టం చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమానికి సంఘీభావంగా విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ బీజేపీతో కలిసి ఉన్నప్పుడు టీడీపీ నేతలకు కడప ఉక్కు పరిశ్రమ ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. 29న కడప జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి సీపీఐ, సీపీఎం, జనసేన, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.