న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) :
పెట్రో ధరలను చమురు సంస్థలు మరోసారి పెంచాయి. పెట్రోల్ లీటర్ ధరను 60 పైసలు, డీజిల్ ధరను 50 పైసలు పెంచుతూ చమురు సంస్థలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని ఆయా సంస్థలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ నియంత్రణ ఎత్తివేయడంతో చమురు సంస్థలు ఇష్టం వచ్చినట్లుగా ధరలు పెంచుతూ పోతున్నాయి. సబ్సిడీ గ్యాస్ ధరలు కూడా పెంచేందుకు చమురు సంస్థలు చేసిన ప్రతిపాదనను పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిరాకరించడంతో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతోనే సరిపెట్టాయి. ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతున్న చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా దేశీయ మార్కెట్‌లో మాత్రం ధరలు ఆ స్థాయిలో తగ్గించడం లేదు. ఎన్నికల వేళ ప్రజలపై కేంద్రం మరోమారు పెట్రో భారాన్ని మోపడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
స్వల్పంగా పెట్రో మంట





