ఏప్రిల్ రెండో వారం నుంచి ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు
న్యూఢిల్లీ, మార్చి 2 (జనంసాక్షి) :
సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనుంది. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ రెండో వారం నుంచి కనీవినీ ఎరుగని రీతిలో ఏడు విడతలుగా జరుగనున్నాయని అత్యంత విశ్వసనీయ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఏప్రిల్ ఏడు లేదా తొమ్మిదో తేదీ నుంచి ఎన్నికలు ప్రారంభం కావచ్చునని ఎన్నికల సంఘం వర్గాలు పీటీఐ వార్తాసంస్థకు చెప్పాయి. ఎన్నికల షెడ్యూల్‌కు ఇప్పటికీ ‘మెరుగులు దిద్దుతున్నట్లు’ వారు తెలిపారు. ప్రస్తుతానికి 81 కోట్ల మందికి పైగా ఓటర్లు పాల్గొనే ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ దాన్ని ఆరు విడతలకు కుదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2009 ఎన్నికలను ఏప్రిల్ 16 నుంచి మే 13 దాకా ఐదు విడతల్లో జరిపారు. ఎంతగానో ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్‌ను ఈ వారం మధ్యలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు ప్రకటన చేసిన తేదీ నాటి నుంచి ప్రభుత్వాలు, పార్టీలకు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అయితే గత మాసం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పార్టీలు డిమాండ్ చేసినట్లుగా షెడ్యూల్‌ను ముందుకు జరపడం లేదా కుదించడాన్ని ఎన్నికల తోసిపుచ్చింది. ప్రస్తుత లోక్‌సభ కాల వ్యవధి జూన్ ఒకటవ తేదీతో ముగుస్తుంది. మే 31 నాటికి కొత్త లోక్‌సభ ఏర్పాటు కావాల్సి ఉంది. లోక్‌సభతో పాటుగా ఆంధ్రప్రదేశ్, కొత్తగా ఏర్పాటు కానున్న తెలంగాణ, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. షెడ్యూల్‌కు తుది మెరుగులు దిద్దుతున్నట్లు ఎన్నికల సంఘం విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, పారా మిలటరీ బలగాలు, రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారంలతో సంప్రదింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. కేంద్రం కొన్ని ఆర్డినెన్సులను తీసుకురావడం కోసం ప్రకటనలో కొంత జాప్యం జరగవచ్చు అనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పటిదాకా దానికి సంబంధించి ఎలాంటి నిర్ధారణ చేయలేదు. ఆరు లేదా ఏడు విడతల షెడ్యూల్‌ను ఖరారు చేసిన పక్షంలో దేశ ఎన్నికల చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు జరిగినవిగా వచ్చే ఎన్నికలు నమోదవుతాయి. ఎన్నికలు జరిగే రోజుల్లో బలగాలను గరిష్టంగా వినియోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వర్గాలు వెల్లడించాయి. తొలి విడత ఎన్నికలు నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో జరగవచ్చు. ఎన్నికలు సజావుగా, పారదర్శంగా జరగడం కోసం మొత్తంగా. 1.1 కోట్ల మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటారు. వారిలో సగం మంది భద్రతా బలగాలకు చెందినవారు ఉంటారు. కనీసం 55 లక్షల మంది ప్రభుత్వ సిబ్బందిన నియమిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్లు, ఎన్నికల సిబ్బంది సౌకర్యార్ధం దేశవ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 12 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) వినియోగిస్తారు. యావత్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు మూడు నెలలు పడుతుందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునేలా అడ్డుకునేలా సుదీర్ఘ కాలం పాటు ఎన్నికల కోడ్‌ను అమలు చేయరాదంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన దృష్ట్యా ఎన్నికల షేడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఆరు వారాల్లో ఎన్నికలు ప్రారంభం కావాలి. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ కాలవ్యవధి ముగిసిపోవడానికి ముందు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్నికల సంఘం దాదాపు రెండు వారాల సమయం ఇవ్వాలని వారు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఎన్నికల సంఘం ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో రెండు ఇవిఎంలను పక్కపక్కనే ఉంచుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 42 లోక్‌సభ స్థానాలు, 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ సానాలు మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా తెలంగాణలో 17 లోక్‌సభ, 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాలు, సిక్కిం రాష్ట్రంలో 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ రెండో తేదీతో ముగియనుంది. అదే సమయంలో బడిశా అసెంబ్లీ గడువు జూన్ ఏడవ తేదీ, సిక్కిం మే 21వ తేదీతో ముగుస్తుంది.




