ఎంఐఎంతో మైత్రి కొనసాగుతుంది
కిరణ్ పార్టీ పెట్టడం సిల్లీ : బొత్స
హైదరాబాద్, మార్చి 6 (జనంసాక్షి) :
ఎంఐఎంతో మైత్రీబంధం కొనసాగుతుందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం గాంధీభవన్‌లో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలతో బొత్స భేటీ అయ్యారు. మున్సిపల్, అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారు. ఎంపీలు, మాజీ మంత్రులు, జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్ బేరర్లు ఈ భేటీకి హాజరయ్యారు. తెలంగాణకు ప్రత్యేక పీసీసీ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సారయ్య, సునీత, గండ్ర తదితరులు జానారెడ్డి ఇంట్లో సమావేశమై ఈ విషయంపై మంతనాలు జరిపారు. గాంధీభవన్‌లో జరుగుతున్న భేటీలో తమ అభిప్రాయాలు చెప్పాలని నేతలు నిర్ణయించారు. ఆదిలావుంటే సమావేశంనుంచి ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ మధ్యలోనే వెళ్లిపోయారు. మున్సిపల్, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు దూసుకు వస్తున్న తరుణంలో భవిష్యత్ కార్యాచరణలో కాంగ్రెస్ నేతలు పడ్డారు. మరోవైపు ఇరు ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. అలాగే బొత్స ఎంఐఎం ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికలలో కలసి పోటీ చేయాలని ఒవైసీతో బొత్స ప్రతిపాదించారని సమాచారం. అయితే, తమ పార్టీలో చర్చించిన తర్వాత గానీ ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకోలేమని, పొత్తు అంశాన్ని పార్టీలో ప్రస్తావనకు పెడతానని సీనియర్ ఒవైసీ అన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఎంఐఎంతో కలసి ఎన్నికల సమరానికి సన్నద్ధం కావాలని ఆలోచనలో ఉన్నారు. అందుకోసం ఇప్పటికే ఆయన కుమారుడు, ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఒకవైపు ఎంఐఎంతోను, మరోవైపు వామపక్షాలతోను చర్చలు జరుపుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో రాష్టాన్రికి చెందిన నేతలు వరసగా భేటీ అవుతున్నారు. కాసేపటిక్రితం మాజీ మంత్రి జానారెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బొత్స సత్యనారాయణతో సమావేశమయ్యారు.మరోవైపు రానున్న మున్సిపల్, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు కసరత్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఆ ప్రాంత నేతలు గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో సమావేశం కానున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో తమ ప్రాంతానికి ప్రత్యేక పీసీసీ ఏర్పాటు చేయకపోవడంపై పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు కిరణ్ పార్టీపై బొత్స స్పందించారు. ఆయన పార్టీ పెట్టడం సిల్లీ విషయమని, దేశంలోని 150 పార్టీల్లో అది ఒక పార్టీ అని తెలిపారు.