హైదరాబాద్, మార్చి 7 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తన వల్లే సాధ్యమైందని టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రకటించుకోవడంపై బిజెపి నేత నాగం జనార్దనరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణా ఉద్యమకారులను అవమానపరిచేలా కెసిఆర్ వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. గత 60 సంవత్సరాల తెలంగాణా ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యమకారులు ఆందోళనలు చేయబట్టే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణా ఇవ్వాల్సి వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణా రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన 13 సంవత్సరాల నుండి ప్రభుత్వంలో ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా గురించి పట్టించుకోలేదని అన్నారు. 2004 ఎన్నికల్లో తెలంగాణా ఇస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ.. పదేళ్ల నుండి తెలంగాణా ఇవ్వకుండా నానబెట్ట బట్టే వందలాది మంది తెలంగాణావాదులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఎన్డీఎ ప్రభుత్వం గతంలో ప్రజల కోరిక మేరకు మూడు రాష్ట్రాలు ఇచ్చిన చరిత్ర ఉందని, 2014లో ఎన్డీఎ అధికారంలోకి వస్తే తెలంగాణా ఇచ్చి తీరుతుందన్న భయంతోనే యుపిఎ ప్రభుత్వం తెలంగాణాపై హడావుడిగా నిర్ణయం తీసుకున్నదని నాగం అన్నారు. కేంద్ర ప్రభుత్వ తొందరపాటు వల్లే ఇరు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగాయని ఆయన అన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఇవ్వమంటే సీమాంధ్రకు అన్యాయం చేయమని బిజెపి ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. 2014లో బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణా ఇస్తుందన్న భయంతో 2004 ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణాను ప్రకటించిందని ఆయన విమర్శించారు. గత పది సంవత్సరాల నుండి అనేక రూపాల్లో తెలంగాణా ఉద్యమం తీవ్ర రూపం దాల్చినా.. సోనియాగాంధీ గాని ప్రధాని మన్మోహన్‌సింగ్ గాని ఏనాడూ నోరు విప్పలేదని నాగం అన్నారు. తెలంగాణా ప్రజల ఆకాంక్ష మేరకే కేంద్రప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతు ఇస్తామని చెప్పిన బిజెపి మాటకు కట్టుబడి బిల్లుకు మద్దతు పలికిందని ఆయన అన్నారు. బిజెపి సహకారం లేకుండా తెలంగాణా వచ్చేదా అని ఆయన కెసిఆర్‌ను ప్రశ్నించారు. విద్యార్థులు, ఉద్యమకారులు, అమరవీరుల త్యాగం వల్లే తెలంగాణా ఏర్పాటైందని నాగం అన్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన వారిని వదిలిపెట్టి పంట చేత పట్టుకున్న వారు గొప్పలు చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణాలో ఓట్లు అడిగే హక్కు ఒక్క బిజెపికే ఉందని అన్నారు.




