Tuesday, 3 November 2026

స్థానిక ఎన్నికలపై సుప్రీం గుస్సా

రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ ఇవ్వండి

లేదంటే కోర్టు ధిక్కరణ కేసులు

న్యూఢిల్లీ, మార్చి 7 (జనంసాక్షి) :

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో తక్షణమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఆ ఆదేశాలలో పేర్కొంది. నోటిఫికేషన్‌ ఇవ్వకుంటే కోర్టు ధిక్కారణ నేరం కింద పరిగణింపవలసి ఉంటుందని వెల్లడించింది. 2013, ఫిబ్రవరి 18న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ఎప్పుడో నిర్వహించాల్సిన ఎన్నికలను నిర్వహించకుండా కాలయాపన చేయడాన్ని తప్పుపట్టింది. దీంతో మున్సిపల్‌ ఎన్నికల పరిస్థితి ఇప్పుడు జెడ్పీలకు తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. సాధారణ ఎన్నికలకు ముందే జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. మార్చి 30న మున్సిపల్‌, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలలో పేర్కొంది.మున్సిపల్‌ ఎన్నికలు, సాధారణ జమిలి ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశాలతో జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ప్రభుత్వం నోటీఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికలకు సోమవారంలోపు నోటిఫికేషన్‌ జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. స్థానిక సంస్థల రిజర్వేషన్ల పక్రియపై పంచాయితీ రాజ్‌ శాఖ కసరత్తు చేస్తుంది. సాయంత్రం స్థానిక సంస్థల రిజర్వేషన్‌ పక్రియ ఫైల్‌ గవర్నర్‌కు చేరనుంది. గవర్నర్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రిజర్వేషన్ల జాబితాను పంచాయితీరాజ్‌ శాఖ రెండు రోజుల్లో ఈసీకి ఇవ్వనుంది. సోమవారం లోపు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *