కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 7 (జనంసాక్షి) :
21వ శతాబ్దం విజన్ సోషలిజమేనని కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి అన్నారు. ప్రజల కనీస అవసరాలపై అందరూ దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. తెలంగాణ మేధావుల ఆధ్వర్యంలో డెమోక్రసీ, సోషలిజం విజన్ 21 సెంచరీ పై హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు ముఖ్యఅతిధిగా జైపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 21వ శతాబ్దం విజన్ సోషలిజమేనని తెలిపారు. వేల కోట్లు ఖర్చు పెడుతున్నా పేదరికంలో మార్పురావడం లేదన్నారు. దీనికి ఎక్కడ లోపం ఉందో గుర్తించి అందుకు నఅఉగుణంగా మనమంతా కలసి పనిచేయాలన్నారు. పేదరికాన్ని నిర్మూలించడంలో విఫలమవుతున్నామని, అయితే పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ప్రజల కనీస అవసరాలు తీరితే ఆదాయం పెరుగుదలలో మార్పు కనిపిస్తుందని అన్నారు. రోజు రోజుకు సమాజంలో మల్టీ కల్చరిజం పెరిగిపోతోంది. ప్రతి ఒక్కరూ కల్చరల్ ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సుకు 25 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి 25 మంది మేధావులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.




