Tuesday, 3 November 2026

పాకిస్థాన్‌లో ఆమ్‌ ఆద్మీ


కేజ్రీవాల్‌కు జడ్‌ ప్లస్‌
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌, మార్చి 9 (జనంసాక్షి) :
దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ పాకిస్థాన్‌లో పురుడుపోసుకుంది. భారత్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్‌ ఆప్‌ను స్ఫూర్తిగా తీసుకున్న పాకిస్థానీ ఒకరు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఏఏపీ) పేరుతో పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం వద్ద పార్టీని రిజిస్టర్‌ చేసుకున్నారు. గుజ్రన్‌వాలాలోని అర్సలాన్‌ ఉల్‌ ముల్క్‌ గ్రూపునకు చెందిన మితవాదులు ఆప్‌ను ఎన్నికల సంఘం వద్ద నమోదు చేశారు. పాకిస్థాన్‌ వ్యవస్థాపకుడు మహ్మద్‌ అలీ జిన్నా కన్న కలలను నిజం చేస్తామని ఆప్‌ చైర్మన్‌ తెలిపారు. కేజ్రీవాల్‌ ఉద్యమ పంథా స్ఫూర్తిగానే వచ్చేవారంలో పంజాబ్‌ అసెంబ్లీ ఎదుట నిరవధిక దీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పోలీసు సంస్కరణలు, వేధింపుల నిరోధక చట్టాన్ని ఆమోదించాలనే డిమాండ్‌తో నిరవధిక దీక్ష ఆరంభించనున్నారు. ఏ ఉద్దేశంతో పాకిస్థాన్‌ ఏర్పడిందో ఆ ఆశయం నెరవేరడం లేదని, ప్రస్తుత రాజకీయ నాయకత్వం, అధికార వ్యవస్థ ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయని తెలిపారు. జిన్నా కలలు కన్న పాకిస్థాన్‌ ఇది కాదని ఆప్‌ నేతలు పేర్కొన్నారు. మరోవైపు ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎట్టకేలకు జెడ్‌ప్లస్‌ భద్రతకు అంగీకరించినట్లు సమాచారం. ఇండియన్‌ ముజాహిద్‌ బెదిరింపుల నేపథ్యంలో జెడ్‌ ప్లస్‌ భద్రతను ఢిల్లీ పోలీసులు ప్రతిపాదించారు. ఇకపై కేజ్రీవాల్‌కు 22 మంది గార్డులతో భద్రత కల్పించనున్నారు. యాసిన్‌ భత్కల్‌ను విడిపించుకునేందుకు ఎంహెచ్‌ కేజ్రీవాల్‌ కిడ్నాప్‌నకు కుట్ర పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఇది వరకే హెచ్చరించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *