
జైరామ్ రమేశ్
కరీంనగర్, మార్చి 9 (జనంసాక్షి) :
రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణలో ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలు లేవని కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్విభజన అనరతరం సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పర్యటిస్తున్న జైరామ్ రమేశ్ ఆదివారం హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా మీదుగా కరీంనగర్‌కు చేరుకున్నారు. సిద్దిపేట, కరీంనగర్‌లలో నిర్వహించిన తెలంగాణ కృతజ్ఞతల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విభజన అంశంపై ఎవరు కోర్టుకు పోయినా ఎలాంటి ఇబ్బంది తలెత్తబోదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని పేర్కొన్నారు. కేంద్ర జలసంఘం ఆమోదం లేకపోవడం వల్లనే రాష్ట్ర విభజన సమయంలో ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వలేకపోయామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు న్యాయం చేస్తుందని చెప్పారు. తెలంగాణ సాధన కోసం ఈ ప్రాంత నేతలు ఎన్ని ఉద్యమాలు చేసినా పార్టీ గీసిన లక్ష్మణ రేఖను దాటలేదని కితాబిచ్చారు. తెలంగాణ బిల్లును లోక్‌సభలో ఆమోదించిన బీజేపీ రాజ్యసభలో అడ్డుకునేందుకు ప్రయత్నించిందని చెప్పారు. కేంద్ర మంత్రి చిరంజీవి కూడా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని పట్టుబట్టారని తెలిపారు. అయినా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట కోసం తెలంగాణను ఏర్పాటు చేసిందన్నారు.
రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ




