
రెండు రాష్ట్రాల్లో సామాజిక న్యాయం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరు మేనిఫెస్టోలు : బొత్స
హైదరాబాద్, మార్చి 9 (జనంసాక్షి) :
త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు చెందిన నాయకులకు దండిగా సీట్లు ఇవ్వడానికి తమ పార్టీ ప్రయత్నిస్తుందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారయణ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఇక్కడ గాంధీ భవన్ వద్ద విలేకరులతో మాట్లాడారు. అదే తరహా హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. బాబుకు మాట ఇవ్వడమే తప్ప ఒక్కనాడు నెరవేర్చిన పాపాన పోలేదని బొత్స విమర్శించారు. టీడీపీకి లాగా కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లోనూ బలహిన వర్గాల నాయకులకు మరిన్ని సీట్లు కేటాయిస్తూ వస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తమ పార్టీ బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తుంది అని ఆయన తెలిపారు. తమ పార్టీ సాధారణ ఎన్నికల్లో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు రెండు వేర్వేరు మేనిఫేస్టోలు విడుదల చేస్తుందని బొత్స వెల్లడించారు. అంతకు ముందు బొత్స వచ్చే ఎన్నికలపై పార్టీ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా సార్వత్రిక ఎన్నికలకు సమన్వయకర్తల సన్నాహాకాలను ఆయన సమీక్షించారు.
బీసీలకు దండిగా సీట్లు




