Wednesday, 4 November 2026

మహబూబ్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి శ్రీనివాస్‌గౌడ్‌

వివాదాస్పదమవుతున్న గౌడ్‌ ఎంపిక

మైనార్టీ సీట్లు ఇతరులకెలా ఇస్తారు?

పునర్నిర్మాణమంటే ముస్లింలను విస్మరించడమా?

మండిపడుతున్న మైనార్టీ పెద్దలు

మహబూబ్‌నగర్‌, మార్చి 11 (జనంసాక్షి) :

మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీగా తెలంగాణ రాజకీయ జేఏసీ కో చైర్మన్‌, టీజీవో అధ్యక్షుడు వి. శ్రీనివాస్‌ గౌడ్‌ను నియమిస్తున్నట్లు ఆపార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నేతగా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. మరోవైపు ఇప్పటి వరకు మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ఇబ్రహీంను శాసనసభ ఎన్నికల అనంతరం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిపిస్తామని  కెసిఆర్‌ హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన శ్రీనివాస్‌గౌడ్‌ను రాజకీయంగా ఆదుకోవాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే ఆయనకు వచ్చే ఎన్నికల్లో పాలమూరు టిక్కెట్‌ ఇస్తానని హావిూ ఇచ్చారు. ఇదిలావుంటే తెలంగాణ పునర్నిర్మాణం కోసమే తాను టిడిపినివీడి, టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు నారాయణపేట ఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రంతో నేరవేరిందని, ఇపుడు అదే స్థాయిలో తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే  కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. బుధవారం తన అనుచరులతో కలసి తెరాసలో చేరుతున్నట్లు చెప్పారు. ఈనెల 12న హైదరాబాద్‌లో కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరుతున్నట్లు నారాయణపేట ఎమ్మెల్యే ఎల్లారెడ్డి విలేఖరులకు తెలిపారు. నియోజకవర్గంలోని తన అనుచరులు, అభిమానులతో సంప్రదించానని, అందరి ఏకాభిప్రాయం మేరకు తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున బరిలో ఉంటానన్నారు.

అయితే ముస్లిం నేత ఇన్‌చార్జిగా ఉన్న మహబూబ్‌నగర్‌ నుంచి శ్రీనివాస్‌గౌడ్‌ను బరిలో నిలపాలనే కేసీఆర్‌ నిర్ణయం వివాదాస్పదమైంది. ఆయన నిర్ణయంపై మైనార్టీ పెద్దలు మండిపడుతున్నారు. మైనార్టీలకు కేటాయించిన సీట్లు ఇతరులకు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణమంటే ముస్లింలను విస్మరించడం, వారి సీట్లు కొట్టేయడమేనా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *