ప్లీజ్ వాయిదా వేయండి
సుప్రీంను అభ్యర్థించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
అఫిడవిట్ ఇవ్వండి.. పరిశీలిస్తాం : సర్వోన్నత న్యాయస్థానం
హైదరాబాద్, మార్చి 12 (జనంసాక్షి) :
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించలేమని, దయచేసి వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టును అభ్యర్థించింది. వరుస ఎన్నికల నేపథ్యంలో వాటి ప్రభావం సార్వత్రిక, శాసనసభ ఎన్నికలపై పడవచ్చని, ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టును కోరింది. రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల అభిప్రాయాలతో కూడిన అఫిడవిట్ సమర్పిస్తే ఎన్నికల వాయిదా అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గుర్తింపు పొందిన, నమోదు చేసుకున్న పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. పార్టీల అభిప్రాయాలను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల పక్రియ కొనసాగుతోందని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5,419 ఎన్నికల కేసులు నమోదు అయ్యాయని, 2,192 మందిని అరెస్టు చేశామని నవీన్‌మిట్టల్ తెలిపారు. 59,205 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నామని, అక్రమ మద్యం నిల్వ వ్యవహారంలో 3751 కేసులు నమోదు చేశామని, 1.284 మందిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్రంలోని 22 జిల్లాల్లో మంగళవారం వరకు మొత్తం 731 నామినేషన్లు దాఖలయ్యాయని, అందులో 201 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారని ఎన్నికల అధికారి నవీన్ మిట్టల్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో అధికంగా 137 నామినేషన్లు, ప్రకాశం జిల్లాలో తక్కువగా 9 నామినేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు వెలువడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తుదితీర్పు వచ్చేవరకు ఎన్నికల షెడ్యూల్డ్ యథాతథంగా అమలులో ఉంటుందని నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రామాణికం కాదని, సుప్రీంకోర్టు తీర్పునే పరిగణలోకి తీసుకుంటామన్నారు.




