Wednesday, 4 November 2026

విదర్భ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాల్సిందే

చిన్న రాష్ట్రాలకు అనుకూలం : కేజ్రీవాల్‌

ముంబై, మార్చి 14 (జనంసాక్షి) :

మహారాష్ట్ర నుంచి విదర్భ వేరు పడాల్సిందేనని, పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కోరారు. తమ పార్టీ చిన్న రాష్ట్రాలకు సానుకూలమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆయన మీడియాపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మీడియా అమ్ముడు పోయిందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షంలో ఆ అంశంపై విచారణ చేపట్టిన అనంతరం మీడియా ప్రతినిధులను జైలుకు పంపిస్తానని ఆయన బెదిరించారు. ఈ సారి యావత్‌ మీడియా అమ్ముడు పోయింది. ఇదో పెద్ద కుట్ర, ఇదో పెద్ద రాజకీయ వివాదం. మాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పక్షంలో మేం దీనిపై విచారణకు ఆదేశిస్తాం. మీడియా ప్రతినిధులతో పాటుగా అందర్నీ జైలుకు పంపిస్తాం అని కేజ్రీవాల్‌ హెచ్చరించారు. తన భద్రతా ఏర్పాట్లపై మీడియా దృష్టి పెట్టడంపై ఆయన మండిపడ్డారు. కొత్త వివాదానికి తెర తీస్తున్నట్లుగా, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి విస్తృతమైన ప్రచారం చేయడం కోసం భారీ మొత్తాలు చెల్లించారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. కానీ కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, బిజెపి, సిపిఐ విమర్శలు గుప్పించడంతో మీడియాపై తాను చేసినట్లుగా వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. గత ఏడాది కాలంగా మోడీ ఇక్కడ ఉన్నారు. మోడీ అక్కడ ఉన్నారు అంటూ మీడియా మనకు చెబుతూ వస్తోంది. అవినీతి అదృశ్మమైపోతుంది. అంటూ ఊదరగొడుతున్నాయి. వారెందుకు అలా చేస్తున్నారు. ఎందుకంటే ఆ టీవి చానళ్లకు నగదు చెల్లించారు కాబట్టి, మోడీకి ప్రచారం చేయడం కోసం భారీ మొత్తాలు ముట్టచెప్పారు అని కేజ్రీవాల్‌ ఆరోపణలు చేస్తున్నట్టుగా ఉన్న ఒక వీడియో ఒక టివీ చానల్‌లో ప్రసారమైంది. ”గుజరాత్‌లో గడిచిన పదేళ్లలో దాదాపు 800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క టీవి చానల్‌ కూడా దాన్ని చూపదు” అని ఆయన ఆరొపించారు. రైతులు వారి భూములను కంపెనీలకు  కేవలం ఒక్క రూపాయికే అమ్ముకున్నారు. కానీ ఈ విషయాన్ని ఒక్క టివీ చానల్‌ కూడా చూసడంలేదు అని కేజ్రీవాల్‌ మండిపడ్డారు. అయితే ఆ వీడియో అంతటా ప్రసారం కావడంతో ఏఏపీ నాయకుడు ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. నేను అలా అనలేదు. నేనసలు ఏమీ మాట్లాడలేదు. మీ వల్ల నేనెందుకు మనస్తాపం చెందుతాను అని కేజ్రీవాల్‌ సమాధానవపరచడానికి ప్రయత్నించారు. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలను ఎడిటర్స్‌ గిల్డ్‌ ఖండించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *