సెక్యులర్ ఫోర్సే బలంగా ఉంది
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్
న్యూఢిల్లీ, మార్చి 15 (జనంసాక్షి) :
త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకునే అవకాశమే లేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వందలోపు సీట్లు మాత్రమే గెలుస్తుందని, బీజేపీకి ప్రజలు అధికారం కట్టబెట్టే అవకాశం ఉందన్న సర్వేలను ఆయన తోసిపుచ్చారు. ఆ సర్వేలు ధర్మసమ్మతమా? అని ప్రశ్నించారు. ఆ సర్వేలను జోక్‌గా అభివర్ణించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నరేంద్రమోడీ ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశమే లేదని, లౌకిక శక్తులే దేశంలో బలంగా ఉన్నయాన్న విషయాన్ని విస్మరించవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 200 సీట్లకుపైగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలెవరూ సర్వేలు చూసి అధైర్య పడవద్దని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీయే అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారం చెప్తున్న అంశాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. ప్రజలను మరింత నిరాశలోకి నెట్టడమే ఎజెండాగా బీజేపీ ప్రచారం సాగిస్తుందని ఆరోపించారు. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించవద్దని కోరారు. బీజేపీ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మోడీ ప్రధాని కాలేడు





