Tuesday, 3 November 2026

అగ్రనేతలను పక్కకుబెట్టి వ్యక్తి పూజలో భాజపా


లోకాయుక్త, స.హ. చట్ట కమిషనర్లు గుజరాత్‌లో ఎందుకు లేరు
పేదల భూములు పెట్టుబడిదారులకు.. ఇదే గుజరాత్‌ అభివృద్ధి : రాహుల్‌
లక్నో, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) :
అగ్రనేతలను విస్మరించి భారతీయ జనతా పార్టీ వ్యక్తి పూజలో తరిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రా హుల్‌గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం ఆయన తమ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌దళ్‌ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తులకు విలువలేదని, పార్టీలకే ప్రాధాన్యముంటుంద ని ఆయన అన్నారు. ఈ వాస్తవాన్ని విస్మరించి బీజేపీ గుజరాత్‌ ముఖ్యమంత్రిని అహో ఒహో అంటూ ఆకా శానికెత్తుందని మండిపడ్డారు. గుజరాత్‌ అభివృద్ధి నమూనా పేరుతో ప్రజలను మభ్య పెట్టడానికి ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావని ఆయన తేల్చిచెప్పారు. గుజరాత్‌లో లోకాయుక్త, సమాచార హక్కు చట్టం కమిషనర్లు ఎందుకు లేరని ఆయన ప్రశ్నించారు. బయటికి ఎన్నో నీతులు చెప్తున్న బీజేపీ నేతలు గుజరాత్‌లో వాస్తవ పరిస్థితులను ఎందుకు కప్పిపుచ్చుతున్నారని ప్రశ్నించారు. పేదల భూములు గద్దలా కొట్టేసిన నరేంద్రమోడీ సర్కారు కార్పొరేట్లకు, వ్యాపారులకు కౌరు చౌకగా ఆ భూములను కట్టబెట్టిందని ఆయన తెలిపారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వం కార్పొరేట్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టిందని మండిపడ్డారు. మతం ప్రాతిపదికన ప్రజల మధ్య విద్వేషాలు రగల్చేందుకు ప్రయత్నిస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో లౌకికవాద సర్కారు ఏర్పాటే ధ్యేయంగా ప్రజలు ఓటు వేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *