Tuesday, 3 November 2026

సీబీఐ అధికారిణి అర్చన సస్పెన్షన్‌‌‌‌‌‌పై ‘సుప్రీం’ జోక్యం

బాధ్యతలు స్వీకరించిన కాస్సేపటికే వేటు
చెన్నై : సీబీఐ తొలి మహిళా అదనపు డైరెక్టర్‌గా తమిళనాడు కేడర్ ఐపిఎస్ అధికారిణి అర్చనా రామసుందరం నియామకంపై చెలరేగిన వివాదం కొత్తమలుపు తిరిగింది. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు తదువరి ఆదేశాలు వెలువరించేంత వరకు అర్చన నూతన బాధ్యతలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి ఆర్ ఎమ్ లోధా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. అర్చన నియామకం, ఎంపికకు సంబంధించిన అన్ని రికార్డులను జూలై 14లోపు తనముందు ఉంచాలని కేంద్రాన్ని కోరింది.
సీబీఐ అదనపు డైరెక్టర్‌గా చేరిన గంటల్లోపే తమిళనాడు కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారిణి అర్చనను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నూతన విధుల్లో చేరడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతిని ఆధికారపూర్వకంగా ఆమె తీసుకోలేదని అర్చనపై ఆరోపించింది. సస్పెన్షన్ ఆర్డర్ అమల్లో ఉన్నంతవరకు అర్చన చెన్నయ్‌లోనే ఉండాలని ఆర్డర్ జారీ చేసిన తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ పేర్కొన్నారు. అయితే అర్చన సీబీఐ అదనపు డైరెక్టర్‌గా గురువారమే విధుల్లో చేరారని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం వ్యర్థమని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా వ్యాఖ్యానించారు.
అయితే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని నియామకాల కమిటీ అర్చన నియామకం గురించి తమిళనాడు ప్రభుత్వానికి ఫిబ్రవరి నెలలోనే సమాచారం పంపినప్పటికీ స్పందించని ఆ రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యా చేపట్టలేదు. అయితే గురువారం అర్చన సీబీఐలో అదనపు డైరెక్టరుగా విధుల్లో చేరిన కాస్సేపటికే అఖిల భారత సర్వీసుల నిబంధనలు 1969 ప్రకారం తనకున్న అధికారాన్ని ఉపయోగించుకుని జయ ప్రభుత్వం ఆమెపై వేటు వేసింది.
అర్చన భర్త, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఎస్ రామసుందరం డిఎంకే సన్నిహితుడిగా సుపరిచితులు. డిఎంకే పార్టీ 2006 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు సాధించన తర్వాత ఈ దంపతులు ఇరువురూ కేంద్రం నుంచి డిప్యుటేషన్‌పై తమిళనాడుకు వచ్చారు.
1980 సంవత్సరం ఐపీఎస్ బ్యాచ్ తమిళనాడు కేడర్‌కు చెందిన అర్చన రామసుందరం ప్రస్తుతం 56 ఏళ్లు. గతంలో సీబీఐలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేశారు. సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా అదనపు డైరెక్టర్ పదవికి ఆమెను సిఫార్సు చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్రమంత్రివర్గం నియామక కమిటీ అర్చన రామసుందరంను ఖరారు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *