
వారణాసి, మే 9 : అమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం వారణాసిలో రోడ్ షో నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలు వెంటరాగా పురవీథుల్లో భారీ ప్రదర్శన చేపట్టారు. పార్టీ గుర్తు చీపుళ్లు పట్టుకున్న కార్యకర్తలు కేజ్రీవాల్ వెంట తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీపై మండిపడ్డారు.
గంగాహారతి వ్యవహారాన్ని మోదీ రాజకీయం చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఓటు అడగడానికి మోదీకి తీరిక లేదని ఆయన విమర్శించారు. హెలికాఫ్టర్‌లో వచ్చి, హెలికాఫ్టర్‌లో వెళ్లారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. కేవలం రెండు గంటలే ఉండే వెళ్లారని, అలాంటి వ్యక్తి ఎన్నికల తర్వాత ప్రజలకు ఏం సేవ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈసారి నేలపై నిలబడే నేతనే ఎన్నుకోవాలని కేజ్రీవాల్ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ అవకాశ రాజకీయాల్ని ఆపేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




