
హైదరాబాద్, మే 15 (జనంసాక్షి) :
సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు ఇచ్చే తీర్పును గౌర విస్తామని మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అ న్నారు. పదేళ్లుగా చేసిన తప్పులకు ఈ ఎన్నికల్లో శిక్ష అ నుభవించబోతున్నామని బొత్స తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలోనే కాదు సీమాంధ్ర అసెంబ్లీ ఎన్ని కల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటమి
తప్పదని ఆయన అంగీకరించారు. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌లో బొత్స మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవి చూస్తుందని వెల్లడించారు. గత పదేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో కొన్ని తప్పులు దొర్లాయని వాటికి సమష్టి బాధ్యతగా ఇప్పుడు అనుభవిస్తున్నామని తెలిపారు. ఆంధప్రదేశ్ విభజన పాపాన్ని అన్ని పార్టీలు కాంగ్రెస్ పైకి నెట్టాయని, అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నామని బొత్స అన్నారు. కాంగ్రెస్ పాలనలో పరిపాలనపరంగా కొన్ని తప్పులు జరిగాయని అంగీకరించారు. కాంగ్రెసు పార్టీ అధికారం కోసం ఎప్పుడు పాకులాడలేదన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని చెప్పారు. అయినా తమ పార్టీకి ఆశించిన ఫలితాలు రావడం లేదన్నారు. అధికారంలోకి తెలుగుదేశం లేదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రానున్నాయన్నారు. అధికారం చేపట్టనున్న రెండు పార్టీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హావిూని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఇచ్చిన హావిూలను ఆయన చదివి వినిపించారు. సీమాంధ్రలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయా పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో వంద రోజుల్లో అమలు చేయాలని బొత్స డిమాండ్ చేశారు. రేపు అధికారంలోకి వచ్చిన పార్టీ ఇచ్చిన హామీల అమలు జరిపేందుకు ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని బొత్స ఈ సందర్బంగా స్ఫష్టం చేశారు.
ప్రజాతీర్పును గౌరవిస్తాం పీసీసీ మాజీ చీఫ్ బొత్స




