Tuesday, 3 November 2026

సార్వత్రిక ఎన్నిక ల్లో బిజెపి విజయదుందుభి

పరాజయాన్ని అంగీకరించిన కాంగ్రెస్, బాబును అభినందించిన నరేంద్ర మోది

   న్యూ ఢిల్లీ, మే 16: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ముందుకు మొక్కవోని ఆత్మ విశ్వాసంతో దూసుకుపోతున్నది. కాంగ్రెస్ పార్టీ మట్టి కరిచింది. ఓటింగు సరళి చాలా స్పష్టంగా ఉంది. ఎన్నికల ఫలితాలు ఇంకా అధికారికంగా ప్రకటించడానికి ముందే కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని అంగీకరించింది. ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో శుక్రవారం ఉదయం పదిన్నరకే ప్రకటించింది.

ఈ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ప్రధాన అభ్యర్థిగా పేర్కొన్న యువనేత రాహుల్ గాంధి సైతం ఒక దశలో వెనుకపడి మళ్లీ కాస్త పుంజుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పిన మహామహులు ఎందరో ఓడిపోతున్నారు. స్పీకర్ మీరా కుమార్, కమల్ నాథ్, కపిల్ సిబాల్, సుశీల్ కుమార్ షిండే వంటివారంతా ఓటమి అంచుల్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఉద్దండులు అందరూ ముందంజలో ఉన్నారు.

బిజెపి నాయకుడు నరేంద్ర మోదీ వడోదరలో ముందుకు దూసుకుపోతున్నారు. ఆయన తమ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయిన మధుసూదన్ మీస్త్రీపై అత్యంత ఘనమైన మెజారిటీతో గెలిచే అవకాశం ఉదయంనుంచే స్పష్టంగా కనిపిస్తున్నది. మోదీ వారణాసి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఆయనపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ పోటీ చేసిన విషయం తెలిసిందే.

భారతీయ జనతా పార్టీ తన ంతట తానుగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పరుగులు తీస్తున్నది. కేంద్రంలో అంతా అనుకున్నట్టే జరగడంతో దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడును అభినందించారు. వీరిరువురూ కొద్ది సేపు టెలిఫోన్‌లో మాట్లాడుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *