రేపు టీఆర్ఎస్ఎల్పీ భేటీ, మోదీ, బాబులకు శుభాకాంక్షలు : కేసీఆర్
హైదరాబాద్, మే 16 : తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నూటకి నూరు శాతం తప్పకుండా అమలు చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు మీడియా సమక్షంలో శుక్రవారం ప్రకటించారు. మ్యానిఫెస్టోను తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధించిన సందర్భంగా తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ విజయానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని ఆయన అన్నారు.
కేంద్రంలో విజయం సాధించిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీకి, సీమాంధ్రలో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మోదీ సహకారం కోరుతామని ఆయన అన్నారు. తెలంగాణలో అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు తమ మీద పెట్టిన బాధ్యతను నిర్వర్తిస్తామని, టీఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు గర్వం పనికి రాదని కేసీఆర్ సూచించారు.
శనివారం (రేపు) మధ్యాహ్నం 12 గంటలకు టీఆర్ఎస్ లెజిస్లేచర్ సమావేశం జరుగుతుందని, నాయకుడిని ఎన్నుకుంటారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావాలన్నారు. తెలంగాణ అభివృద్ధి మాత్రమే పరమావధిగా తాము ముందుకు పోతామన్నారు. తెలంగాణలో మేజిక్ ఫిగర్ దాటడమే కాకుండా దాదాపు 12 ఎంపీ స్థానాలను గెలుచుకుంటున్నామన్నారు. విద్యార్థుల పైన కేసులు ఎత్తివేస్తామన్నారు.
గతంలో జరిగిన నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా జరిగాయని, ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఉన్న నిర్ణయాలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. పేదల సంక్షేమం, వ్యవసాయం, యువతకు ఉద్యోగ అవకాశాలపై తాము ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. తమకు సంపూర్ణ మెజార్టీ వచ్చిందని, తమకు ఎవరి మద్దతు అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.




