Tuesday, 3 November 2026

కెసిఆర్ బృందంతో గవర్నర్

హైదరాబాద్ : తెరాస అధినేత కెసిఆర్‌ సహా ఆదివారం రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్‌తో తెరాస శాసనసభా పక్ష ప్రతినిధి బృందం భేటీకి ఆ పార్టీ సీనియర్ నేత టి హరీష్ రావు దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన గవర్నర్ నరసింహన్, అదే విషయాన్ని తెరాస అధినేత కెసిఆర్, తదితర పార్టీ ఎమ్మెల్యేలతో యధాలాప ధోరణిలో ప్రస్తావించారని తెలిసింది. గతంలో బడ్జెట్ సమావేశాల ప్రారంభ సమయంలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ‘గవర్నర్ గో బ్యాక్’ అని నినదించిన సంగతి తెలిసిందే.దీంతో జోక్యం చేసుకున్న తెరాస సెక్రటరీ జనరల్ కె కేశవరావు తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా అప్పుడు అలా నినాదాలిచ్చారని, వాటిని పట్టించుకోనవసరం లేదని సర్ది చెప్పబోయారు. గవర్నర్ నరసింహన్ కూడా అటువంటి అంశాలను తాను సీరియస్‌గా తీసుకోబోనని, కొత్త ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తానని నరసింహన్ హామీనిచ్చినట్లు సమాచారం.‘నేను మీకు పెద్ద సోదరుడి వంటి వాణ్ణి, కె కేశవరావు మినహా మిగతా వారంతా నాకంటే చిన్నవారే’నని నరసింహన్ చమత్కరించడంతో దర్బారు హాలు నేతల చిరునవ్వులతో నిండిపోయింది.ఆదివారం మధ్యాహ్నం 11.30 గంటలకు గవర్నర్‌ను కలిసిన తర్వాత కెసిఆర్, పార్టీ సీనియర్లు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎంపిలను నరసింహన్‌కు పరిచయం చేశారు.శనివారం జరిగిన టిఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో తమ నాయకుడిగా కెసిఆర్‌ను ఎన్నుకున్నట్లు చేసిన తీర్మాన ప్రతిని టిఆర్ఎస్ నేతలు గవర్నర్‌కు అంద చేశారు. సుమారు 30 నిముషాల పాటు కెసిఆర్, గవర్నర్ నరసింహన్ మధ్య జరిగిన సమావేశం సుహృద్భావ వాతావరణంలో సాగిందని సమాచారం. వచ్చేనెల రెండవ తేదీన ఆవిర్భవించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్ నియమితులు కానున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *