Tuesday, 3 November 2026

గుజరాత్ సిఎంగా ఆనందీబెన్ పటేల్ ప్రమాణ స్వీకారం

గాంధీనగర్ : గుజరాత్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ కమలా బేణీవాల్‌ ఆనందీబెన్ పటేల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే సమయంలో పలువురు బిజెపి ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆనందీబెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వాని, మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ హాజరయ్యారు.
మోడీకి సన్నిహితురాలిగా పేరొందిన పటేల్ మోడీ ప్రభుత్వంలో రెవిన్యూ, పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. మోడీకి ముందు కేశుభాయ్ పటేల్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఆమె పనిచేశారు. వృత్తిరీత్యా స్కూల్ టీచర్ అయిన ఆనందీబెన్ పటేల్ ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నరేంద్ర మోడీ అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను ఆనందీబెన్ చేపట్టారు.
ఆనందీబెన్ పటేల్ బిజెపి సభాపక్ష నాయకురాలిగా బుధవారం ఎంపికయ్యారు. మోడీ సమక్షంలో సమావేశమైన బిజెపి శాసనసభాపక్షం 73 ఏళ్ళ పటేల్ పేరును ప్రతిపాదించింది. అనంతరం ఏకగ్రీవంగా ఆమోదించింది. మోడీకి అత్యంత సన్నిహితుడు అమిత్ షా, బిజెపి ప్రధాన కార్యదర్శి తవర్ చాంద్ గెహ్లాట్ కూడా సమావేశానికి హాజరయ్యారు. అంతకుమునుపు నరేంద్ర మోడి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రానికి సుదీర్ఘకాలంపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన మోడీ లోక్‌సభలో ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించడంలో బిజెపికి నేతృత్వం వహించారు. సోమవారం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *