
గాంధీనగర్, మే 22: గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా గురువారం ఆనందీబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నేతలు ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వ రాజ్, వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీ హాజరయ్యా రు. రాజ్‌భవన్‌లో గవర్నర్ కమలా బేనీవాల్.. ఆనందీబెన్‌తో పాటు ఆరుగురు కేబినెట్ మంత్రులు, 14 మంది సహాయ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మంత్రులు పురుషోత్తం సోలంకి, పరబత్ పటేల్, వసన్ అహిర్‌లకు ఉద్వాసన పలికారు. మోదీ కేబినెట్‌లో మంత్రులుగా చేసిన లీలాధర్ వాఘేలా, జస్వంత్ సిన్హా బబోర్‌లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. కొత్తగా నలుగురికి కేబినెట్‌లో అవకాశం కల్పించారు. పార్టీ తనపై పెద్ద బాధ్యతను ఉంచిందని, దాన్ని సమర్ధంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఆనందీబెన్ తెలిపారు. ఎన్డీయే భాగస్వామి పక్షం శిరోమణీ అకాలీదళ్ నుంచి పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు శివరాజ్ సింగ్ చౌహన్, వసుంధర రాజే, రమణ్‌సింగ్, ఆనందీబెన్ భర్త మఫత్‌భాయ్, కూతురు అనర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.




