Monday, 2 November 2026

సీమాంధ్రలో ఎర్రచందనం స్మగ్లర్ల కాల్చివేత

seemandhra

తిరుమల, మే 29 (జనంసాక్షి) :

సీమాంధ్రలోని చిత్తూరు, కడప జిల్లాల్లో రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్ల దూకుడుపై పోలీసులు పట్టు సాధించారు. అడ్డం వచ్చి, ఎదురుదాడికి దిగిన వారిపై కాల్పులు జరిపారు. తిరుమల శిలాతోరణం అటవీప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు మృతి చెందారు. స్మగ్లర్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. అటవీప్రాంతంలో 80 మంది వరకు స్మగ్లర్లు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. తప్పించుకున్న స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టారు. ఘటనా ప్రాంతానికి చిత్తూరు పట్టణ జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు చేరుకున్నారు. ఉదయం కూంబింగ్‌ చేస్తున్న సమయంలో పోలీసులను చూసి దొంగలు రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు ఎదురుదాడికి దిగి వారిని లొంగిపోవాల్సిందిగా కోరారు. అయినా వినకపోవడంతో కాల్పులు జరిపారు. తరవాత వారంతా పరారయ్యారు. ఈ దాడిలోముగ్గురు మరణించగా పోలీసులకు గాయాలయ్యాయి. గాయాలైన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. ఎర్రచందనం రక్షణకు ఎంతటి చర్యలకైనా వెనకాడబోమని తిరుపతి అర్బన్‌ ఎస్పీ రాజశేఖర్‌బాబు హెచ్చరించారు. స్మగ్లర్ల తీరు మారకపోతే కాల్పులు పునరావృతమవుతాయని అన్నారు. తిరుపతిలో కాల్పులు జరిగిన ప్రాంతాలని ఆయన పరిశీలించారు. స్మగ్లర్లు దాడులు చేయడం వల్లే కాల్పులు జరిపామని, స్మగ్లర్ల దాడిలో పోలీసులకు గాయాలయ్యాయని ఆయన తెలిపారు. రాత్రి పది గంటల సమయంలో స్మగ్లర్లపై కాల్పులు జరిపామని, కాల్పుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు మృతి చెందారని ఎస్పీ పేర్కొన్నారు. కూంబింగ్‌ సమయంలో స్మగ్లర్లు రాళ్లు, గొడ్డళ్లు, బాణాలతో దాడులు చేశారని ఆయన తెలిపారు. తిరుమల అటవీ ప్రాంతంలోని శిలాతోరణం సవిూపంలో ఈ కాల్పుల సంఘటన జరిగింది. దాదాపు 80 మంది స్మగ్లర్లు ఉన్నారని, వారంతా తప్పించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. వారికోసం గాలింపు కొనసాగిస్తున్నారు. మృతిచెందిన ముగ్గురు స్మగ్లర్ల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *