Monday, 2 November 2026

బాబు తొలి సంతకం బూటకం

ఓవైపు విరాళాలు సేకరిస్తూ.. మరో వైపు 30 కోట్లు ఖర్చా?
తూర్పుగోదావరి : రైతు రుణమాఫీపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తొలి సంతకం బూటకమని, తొలి సంతకం పెట్టినా రుణమాఫీ అవుతాయన్న నమ్మకం లేని పరిస్థితి నెలకొందని వైఎస్ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం రాజమండ్రిలోని ఆర్‌ఆండ్‌బీ అతిథి గృహంలో ఆ పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తొలి సంతకం అర్థం లేనిదని, ఏ తేదీ నుంచి రుణాలు మాఫీ అవుతాయో చెబితేనే తొలి సంతకానికి అర్థం ఉంటుందన్నారు. రుణమాఫీపై చంద్రబాబు ఓ పథకం ప్రకారం డ్రామా నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు.కొత్త రాజధానికి డబ్బులు లేవని ఓవైపు ప్రజలను చందాలు అడుగుతున్న బాబు మరోవైపు తన ప్రమాణ స్వీకారానికి రూ. 30 కోట్లు ఖర్చు చేయడమేంటని జగన్ విమర్శించారు. రాజధాని నిర్మాణానికి విరాళాలు సేకరిస్తూ, ప్రమాణ స్వీకారానికి అంత ఖర్చు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అటువంటి కార్యక్రమానికి తాను వెళ్లాల్సిన అవసరం లేదని, ఆ వృధా ఖర్చులో తాను భాగస్వామిని కాలేనని జగన్ తేల్చి చెప్పారు.‘‘ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే నుంచి 9 మంది ఎంపీలు, 70మంది ఎమ్మెల్యేలతో మా పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేం నిర్వహిస్తాం’’ అని జగన్ తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలకు సంబంధించి ప్రతి సమస్యపై ప్రభుత్వంతో పోరాడుతామని ఆయన పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *