Tuesday, 3 November 2026

ముగిసిన కమల్‌నాథ్‌ కమిటీ భేటీ

741

హైదరాబాద్‌, జూన్‌ 19 (జనంసాక్షి) :

కమలనాథన్‌ కమిటీ ఈ నెల 27న మరోమారు భేటీ కావాలని నిర్ణయించింది. సచివాలయంలో గురువారం ఉదయం భేటీ అయి ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలపై కమిటీ చర్చించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధప్రదేశ్‌ సీఎస్‌లు రాజీవ్‌శర్మ, ఐవైఆర్‌ కృష్ణారావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధప్రదేశ్‌, తెలంగాణ ఉన్నతాధికారులతో సచివాలయంలో జరిగిన కమలనాథన్‌ కమిటీ సమావేశం అనేక అంశాలపై చర్చించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలు ఖరారు చేయడానికి కమలనాథన్‌ కమిటీ గురువారమిక్కడ సమావేశమయింది. ఆంధప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్‌ కృష్ణారావు, రాజీవ్‌ శర్మలతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసిన తరువాత వాటిని అభిప్రాయాల కోసం బహిరంగపరుస్తారు. ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనలకు అనుగుణంగా తుది మార్గదర్శకాలను ప్రధానమంత్రి ఆమోదంతో ప్రకటించనున్నారు. అనంతరం ఉద్యోగుల పంపిణీ పక్రియను చేపడతారు.

రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాలు.. రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తరుణంలో ఆయా రాష్ట్రాల్లో కీలకమైన ఉద్యోగుల పంపకాలపై కేందప్రభుత్వం దృష్టి పెట్టింది. రెండు రాష్ట్రాలకు శాశ్వత ఉద్యోగులను నియమించేందుకు మాజీ ఐఏఎస్‌ అధికారి కమల్‌నాథన్‌ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ తుది కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా గురువారం ఉద్యోగుల విభజనపై చర్చించేందుకు కమిటీ ఇక్కడ భేటీ అయ్యింది. ఈ సమావేశానంతరం నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల పంపకాలపై ప్రాథమిక మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు సమాచారం. ఉద్యోగుల విభజనపై కమిటీ ముందుగా ప్రాథమిక మార్గదర్శకాలను సిద్ధం చేసి వాటిపై ఉద్యోగుల అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించనుంది. ఆ తర్వాత నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఇక తుది మార్గదర్శకాలపై కేంద్రం ఆమోదముద్ర వేసిన అనంతరం శాశ్వత ఉద్యోగుల పంపకాల పక్రియ మరింత వేగవంతమవుతుంది. కేంద్రం నుంచి మార్గదర్శకాలు వెలువడిన తర్వాత కమల్‌నాథన్‌ కమిటీ క్యాడర్‌ బలాబలాలు, ఇరు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులు ఉండాలి అనే అంశంపై జాబితాను సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత ఉద్యోగుల నుంచి మరోమారు అభ్యంతరాలను స్వీకరిస్తుంది. ఉద్యోగులకు ఆప్షన్లను ఇచ్చి వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఉద్యోగుల ఆప్షన్‌ కూడా సీనియారిటీ, భార్యాభర్తల విషయం, సుదీర్ఘ వ్యాధులతో బాధపడేవారికి ప్రాధాన్యత ఇస్తామని కమల్‌నాథన్‌ కమిటీ చెప్పినట్టు తెలుస్తోంది. ఆప్షన్లను పరిశీలించిన తర్వాత ఎవరెవరు ఏ రాష్ట్రంలో పనిచేస్తారనే తుది పంపకాల జాబితాను కేంద్రానికి నివేదించనున్నట్టు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు సామరస్యంగా, ఏ రాష్ట్రానికి చెందిన వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వంలోనే పని చేయాలనే ప్రతిపాదన ప్రకారం విభజించాలని అనుకుంటే యేడాదిలోపే ఉద్యోగుల తుది పంపకాలు పూర్తవుతాయని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఏదేమైనా కమల్‌నాథన్‌ నేతృత్వంలోని సలహా మండలి కమిటీ గడువు 2015 మార్చి నాటికి ముగుస్తుండటంతో ఆలోగా పక్రియ పూర్తి చేయాలని యోచిస్తోంది. ఈ కమిటీని తెలంగాణ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌ నేతృత్వంలో ఉద్యోగులు కలసి తమ అభ్యంతరాలను వెల్లడించారు.

పీపీఏల రద్దు చెల్లదు

హైదరాబాద్‌, జూన్‌ 19 (జనంసాక్షి) :విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) రద్దు చేయాలనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతిపాదనను ఎలక్ట్రిసిటీ రెగ్యు లేట రీ కమిషన్‌ (ఈఆర్సీ) తిరస్కరించింది. ఏప్రాంతంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఆ ప్రాంతంలోనే వినియోగించు కునేందుకంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టాన్ని అతిక్రమించి పీపీఏ రద్దుకు సిద్ధపడ్డాడు. అయితే బాబు యత్నాలపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం దాని వెనుకున్న కుట్రను కేంద్రానికి విడమర్చిచెప్పింది. రాష్ట్ర పునర్విభజన సమయంలో అన్నింటినీ జనాభా ప్రాతిపదికన విభజించి ఒక్క విద్యుత్‌ను మాత్రమే వినియోగం ఆధారంగా పంపిణీ చేయడానికి చంద్రబాబు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సీమాంధ్ర ప్రాంతంలో అధికంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తామే వినియో గించుకునేందుకంటూ పీపీఏల రద్దుకు ఏపీ జెన్‌కో ద్వారా ఈఆర్సీకి లేఖ రాయిం చారు. లేఖ రాసింది ఏపీ జెన్‌కోనే అయినే దానికి కర్త,

ఏపీ జెన్‌కో లేఖను తిరస్కరించిన ఈఆర్సీ

కర్మ, క్రియ అన్ని చంద్రబాబే. గురువారం లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌లో నిర్వహించిన ఏపీ కేబినెట్‌ భేటీలోనూ తమ వద్దు మిగులు విద్యుత్‌ ఉంటే మొదట తెలంగాణాకే కేటాయిస్తామంటూ ఏదో జాలిచూపించే ప్రయత్నం చేశారు. అయితే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను ప్రభుత్వం చేసుకోలేదని, పంపిణీ సంస్థలు చేసుకున్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఈ ఒప్పందాలను రద్దు చేయాలంటే రెండు ప్రభుత్వాలు సానుకూలంగా లేఖలు ఇవ్వాలని ఈఆర్సీ స్పష్టం చేసింది. ఈమేరకు ఏపీ జెన్‌కో రాసిన లేఖను తిరస్కరించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కుట్రలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంతాల అభివృద్ధే తన ధ్యేయమని మైకుల ముందు ఉపన్యాసాలిచ్చే చంద్రబాబు తెలంగాణాకు విద్యుత్‌ లోటు తెచ్చిపెట్టేందుకు ఏకంగా పీపీఏల రద్దుకే ఉపక్రమించాడు. ఆయన చర్యలను కేంద్రం కొన్ని గంటల్లోనే వ్యతిరేకించి మొట్టికాయలేయగా తాజాగా ఈఆర్సీ కూడా అంతపనే చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *