హైదరాబాద్, జున్ 29 : దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేయనున్నారు. షార్‌లో సోమవారం పీఎస్ఎల్‌వీ సీ 23 రాకెట్ ప్రయోగాన్ని మోదీ వీక్షించనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు గాను రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా షార్ చేరుకోనున్నారు. ముందుగా ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం 4.40 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో షార్‌కు చేరుకుంటారు. 6.30 గంటల వరకు శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఆ తర్వాత రాత్రి 7.50 గంటలకు మొదటి ప్రయోగ వేదికపై ఉన్న రాకెట్‌ను పరిశీలిస్తారు. మరుసటి రోజు ఉదయం 9.25 గంటలకు మిషన్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకుని పీఎస్ఎల్‌వీ-సీ23 రాకెట్ ప్రయోగాన్ని వీక్షిస్తారు. 10.50 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చెన్నైకు బయలుదేరుతారు.
భారీ బందోబస్తు
వీవీఐపీల తాకిడి నేపథ్యంలో షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎస్‌పీజీ ఐజీ చతుర్వేది ఆధ్వర్యంలో బలగాలు మోహరించాయి. అలాగే గుంటూరు రేంజ్ ఐజీ సునీల్‌కుమార్, నెల్లూరు, అనంతపురం, గుంటూరు ఎస్పీలు నవదీప్‌సింగ్, సెంధిల్‌కుమార్, గోపీనాధ్‌శెట్టి, విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 12 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 160 మంది ఎస్ఐలు, 100 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్ళు, 1500 మంది కానిస్టేబుళ్ళు, 50 మంది మహిళా కానిస్టేబుళ్ళు, 300 సాయుధ దళాలను బందోబస్తుకు ఉపయోగిస్తున్నారు. అలాగే షార్ భద్రతా విభాగం సీఐఎస్ఎఫ్ చెందిన 900 మంది పోలీసులు తుంబాలోని సీనియర్ కామెండెంట్ సుభాష్‌జ్యోషి ఆధ్వర్యంలో బందోబస్తులో పాల్గొంటున్నారు. షార్ మార్గంలో వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.




