తాజా ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని కేంద్రమంత్రి హర్షవర్థన్ ఆదేశం
న్యూఢిల్లీ, జూలై 2 : కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతిపై మళ్లీ వివాదం చోటు చేసుకుంది. ఆమెది సహజమరణమేనంటూ నివేదిక ఇవ్వాలని తనపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఎయిమ్స్ ఆఫ్ ఫారెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్త సంచలన వాఖ్యలు చేశారు. దీనిపై తక్షణం ఒక నివేదిక సమర్పించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ఆదేశించారు.
కేంద్రమాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ ఈ ఏడాది జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని లీలా హోటల్‌లో అనుమానస్పద స్థితిలో మరణించారు. ఆ రోజు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో ఆమె మృత దేహాన్ని శశిథరూర్ స్వయంగా చూశారు. సునంద అకాల మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు మితిమీరి వ్యాధి నిరోధక ఔషధాలు తీసుకోవడంవల్లే సునంద చనిపోయారని ఎయిమ్స్ నివేదిక ఇచ్చింది.
ఇప్పుడు సునంద మృతి వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. సునంద మృతిపై ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిన డాక్టర్ సుధీర్ గుప్త చేసిన తాజా ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. సునంద సహజమరణం చెందారని నివేదిక ఇవ్వాల్సిందిగా తమపై ఒత్తిడి వచ్చిందని పోస్టుమార్టం నివేదిక ఇచ్చిన ఆయన వెల్లడించారు. ఒత్తిడి వచ్చినా లెక్క చేయకుండా తాను నిష్పక్షపాత నివేదిక ఇచ్చానని… అవసరానికి మించి మందులు వాడడంవల్లే ఆమె చనిపోయిందని నివేదిక ఇచ్చామని ఆయన అన్నారు. ఇప్పుడు తాజా ఆరోపణల నేపథ్యంలో సునంద మృతిపై మళ్లీ దర్యాప్తు జరపాలని పలువురు కోరుతున్నారు.
బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి బుధవారం మీడియాతో మాట్లాడుతూ సునంద మృతి అనుమానాస్పదంగానే ఉందని, దానిపై మళ్లీ విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. సునంద ముమ్మాటికి హత్యకు గురయ్యారని నేను నమ్ముతున్నానని ఆయన అన్నారు. ఐపీఎల్ కుంభకోణాలను బైట పెడతాననిఆమె చెప్పారని, అలా జరిగి ఉంటే రాబర్ట్ వాద్రాకు చిక్కులు ఎదురయ్యేవని సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు.
ఎయిమ్స్ ఫోరెన్సిక్ శాఖాధిపతిగా డాక్టర్ సుధీర్ గుప్తను తొలగించి ఆ స్థానంలో మరొకరిని నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫైల్ సిద్ధం చేయడంతో ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కొందరు అంటున్నారు. ఆయన వైఖరిపై కూడా విచారణ జరపాలని వారు చెబుతున్నారు.




