న్యూఢిల్లీ(ఏజెన్సీస్): ప్రతిపక్షంలో తమదే అది పెద్ద పార్టీ కాబట్టి లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడి పదవిని తమ పార్టీకే ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం డిమాండ్ చేశారు.‘‘ప్రతిపక్షంలో మాదే అతి పెద్ద పార్టీ. ఎన్నికలకు ముందే పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం. అందువల్ల ప్రతిపక్ష నాయకుడి పదవికి మేమే అర్హులం’’ అని ఈ అంశంపై మొట్టమొదటిసారి పెదవి విప్పుతూ సోనియా గాంధీ అన్నారు. అయితే ఈ విషయమై న్యాయవ్యవస్థను ఆశ్రయించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సిపిపి) నాయకురాలైన సోనియా చెప్పారు.ప్రతిపక్ష నాయకుడి పదవి కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోందని, తమ ఓటమిని అంగీకరించడం లేదన్న బిజెపి ఆరోపణను ఆమె తిరస్కరించారు. ‘‘అది నిజం కాదు. ఎన్నికల్లో మేము ఓడిపోయాం. ఆ విషయం మాకు తెలుసు’’ అని వ్యాఖ్యానించారు.ప్రతిపక్ష నాయకుడి పదవి అంశం లోక్ సభ స్పీకర్ పరిధిలో ఉందన్న బిజెపి వాదనను ‘‘కుంటి సాకు’’గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్ అభివర్ణించారు. ‘‘స్పీకర్ నుంచి ఆదేశాలు ఉన్నాయనడం కాంగ్రెస్‌కు ఆ పదవి దక్కకుండా చేసేందుకు చూపుతున్న కుంటి సాకు మాత్రమే. రెండు దశాబ్దాల క్రితం నాటితో పోలిస్తే పార్లమెంట్ చాలా భిన్నంగా ఉంది. ఇప్పటి రాజకీయాలు వేరు. పార్లమెంటరీ సంప్రదాయాలు వేరు. అనేక సంవత్సరాలుగా స్పీకర్ నిర్ణయాలు మారిపోతున్నాయి. స్పీకర్ ఆదేశాల మేరకే మేము వ్యవహరిస్తున్నామని వారు(బిజెపి) అనడం మాకు ఆ పదవిని దక్కనివ్వకుండా చేసేందుకు చూపుతున్న కుంటి సాకు మాత్రమే’’ అని పార్లమెంట్ భవనం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ కమల్‌నాథ్ వ్యాఖ్యానించారు.‘‘బిజెపి ఎందుకు భయపడుతోందో నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఎవరికైనా భయముందా? అది కేవలం ఒక హోదా మాత్రమే. అందుకు వారు అంగీకరించాలి…స్పీకర్ ఆదేశాలపైనే వారు ఆధారపడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడి పదవి దక్కాలంటే లోక్ సభలో 10 శాతం సంఖ్యాబలం ఉండాలని ఏ చట్టం చెప్పడం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా, ప్రతిపక్ష నాయకుడి హోదాపై స్పీకర్ మహాజన్ నిర్ణయాన్ని బిజెపి ‘‘ప్రభావితం’’ చేస్తోందన్న కమల్‌నాథ్ వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మండిపడ్డారు. ‘‘కమల్‌నాథ్ లాంటి సీనియర్ నాయకుడి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం. తన సొంత అనుభవంతో ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారేమో! సభానిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి ఎన్నికైన తర్వాత స్పీకర్ పార్టీకి అతీతమవుతారు’’ అని వెంకయ్య నాయుడు అన్నారు.