
న్యూఢిల్లీ: అగస్టావెస్ట్‌ల్యాండ్ నుంచి 12 వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలులో ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న సిబిఐ ఈ కేసులో సాక్షిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ ఇఎస్ఎల్ నరసింహన్ సాక్ష్యాన్ని త్వరలోనే నమోదు చేయనున్నది.2005 మార్చి 1న నరసింహన్ అప్పటి జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఎ) ఎంకె నారాయణన్, అప్పటి ప్రత్యేక భద్రతా గ్రూపు(ఎస్పీజి) అధిపతి బివి వాంచూతో కలసి సమావేశంలో పాల్గొన్నారని, ఆ సమావేశంలోనే హెలికాప్టర్ ప్రయాణించే గరిష్ఠ స్థాయి ఎత్తుపై ఉన్న నిబంధనలను తగ్గించాలన్న నిర్ణయం ఈ సమావేశంలోనే తీసుకున్నారని, దీంతో అగస్టావెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం ఖరారైందని సిబిఐ వర్గాలు తెలిపాయి, రూ. 3600 కోట్ల రూపాయల వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో రూ. 360 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఇటీవలే నారాయణన్, వాంచూలను సాక్షులుగా సిబిఐ ప్రశ్నించింది. హెలికాప్టర్‌కు చెందిన సాంకేతిక నిబంధనలలో కీలకమైన మార్పులు 2005లో జరిగిన సమావేశంలోనే తీసుకున్నారని, ఈ సమావేశంలో పాల్గొన్నందుకే వాంచూ, నారాయణన్ ల వాంగ్మూలాలను సిబిఐ నమోదు చేసిందని వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో నరసింహన్ కూడా పాల్గొన్నారని, హెలికాప్టర్ ఎగిరే గరిష్ఠ స్థాయి ఎత్తుకు సంబంధించిన నిబంధనలను ఎందుకు మార్చవలసి వచ్చిందో మరిన్ని కారణాలు లభిస్తాయన్న ఉద్దేశంతోనే ఆ సమావేశంలో పాల్గొన్న నరసింహన్ ని కూడా సిబిఐ ప్రశ్నించనున్నదని వర్గాలు చెప్పాయి.హెలికాప్టర్ సాధారణంగా ప్రయాణించడానికి అవసరమైన గరిష్ఠ ఎత్తును ‘ఫ్లయింగ్ సీలింగ్’ అంటారు. దీన్ని తగ్గించడంతో బ్రిటన్‌కు చెందిన అగస్టావెస్ట్‌ల్యాండ్ బిడ్డింగ్ పోటీలోకి ప్రవేశించగలిగింది. లేకపోతే ఆ హెలికాప్టర్లకు బిడ్డింగ్‌లో పాల్గొనే యోగ్యత కూడా లేదని సిబిఐ ఆరోపిస్తోంది.ఈ కేసులో భారత వైమానిక దళాల మాజీ ప్రధానాధికారి ఎస్ పి త్యాగి, ఆయన బంధువులు, యూరోపియన్ మధ్యవర్తులతో సహా 13 మంది ఇతరులపై సిబిఐ ఇదివరకే కేసు నమోదు చేసింది.హెలికాప్టర్ ఫ్లయింగ్ సీలింగ్‌ని తగ్గించి అగస్టావెస్ట్‌ల్యాండ్ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారన్నది త్యాగి మీద సిబిఐ చేస్తున్న అభియోగం. అయితే త్యాగి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.