Tuesday, 3 November 2026

సరిహద్దులపై సర్వే

అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌
 హైదరాబాద్‌ : తెలంగాణ సరిహద్దులు, భూముల సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర సరిహద్దులకు రీ సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సర్వే అధికారుల ను కోరారు. సర్వేయర్స్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా స్వర్ణ సుబ్బారావుతో పాటు సర్వే ఆఫ్‌ ఇండియా రిమోట్‌ సెన్సింగ్‌ అధికారులు సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అటవీ, భూమి, సరిహద్దులు ప్రాజెక్టులకు రాష్ట్ర వ్యాప్తంగా రీ సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి వారిని కోరినట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రం అన్యాక్రాంతమైన భూముల చిట్టాను బయటికి తీస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను రెవెన్యూశాఖ ద్వారా వివరాలు సేకరి స్తోంది. మరోపక్క భూముల వివరాలను అంద జేయాలని ఇది వరకే జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే.

సింగరేణి కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్‌

సింగరేణిలో కేంద్రప్రభుత్వ వాటాను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలని సిఎం కె.చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. సింగరేణి కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్‌ అంద జేస్తామని ప్రకటించారు. సకలజనుల సమ్మెకాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణిస్తామని చెప్పారు. సచివాలయం లో సింగరేణి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి కాలరీస్‌ ఛైర్మన్‌, ఎండి సుథీర్త భట్టాచార్య, తెలంగాణ జెన్‌కో సిఎండి డి.ప్రభాకర్‌, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ఎస్‌. నర్సింగ్‌రావు, సింగరేణి కాలరీస్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ రమేష్‌కుమార్‌, తెలంగాణ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగరేణికి సంబంధించిన ఉద్యోగ, ప్రాజెక్టులు, విధి విధానాలతో కూడిన ఎజెండాను రమేష్‌ కుమార్‌ ముఖ్యమంత్రికి అంద జేశారు. ఉద్యోగులు, కార్మికులకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు సింగరేణి పరిధిలోని కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో జిల్లాకో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని కెసిఆర్‌ వెల్లడించారు. సింగరేణికి అనుబంధంగా మరో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. సంస్థకు చెందిన డిపెండెంట్‌ ఉద్యోగులు, డిస్మిస్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాబోయే మూడు మాసాల్లో ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేయాలని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. విదేశాల్లో మైనింగ్‌ యాక్టివేషన్‌ను ప్రారంభించేందుకు పదిమంది సభ్యులతో కూడిన కమిటీ ఆస్ట్రేలియా, మొజాంబిక్‌, ఇథియోపియా, సౌత్‌ ఆఫ్రికా దేశాల్లో పర్యటించాలని, అనంతరం పూర్తి నివేదికను సమర్పించాలని ఆయన ఆదేశించారు. సింగరేణి సంస్థకు మంచి గుర్తింపు ఉందన్నారు. సింగరేణి సంస్థ ముఖచిత్రాన్ని మార్చాలని, ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికార యంత్రాంగాన్ని సూచించారు. రామగుండం ఎన్‌టిపిసికి 1500 ఎకరాలు, జెన్‌కో కు 400 ఎకరాలు, మణుగూరుకు 2వేల ఎకరాలు కేటాయించేందుకు అధికారులు తగుచర్యలు తీసుకోవాలని చెప్పారు. 2015 నవంబరు 15వ తేదీలోపు 1200 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగాలని, అందుకు రెండు సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారయంత్రాంగాన్ని ఆదేశించారు. రెండు భూగర్భ ఖనిజాలను దసరా పండగలోపు ప్రారంభిం చాలని, మరో ఆరు భూగర్భ ఖనిజాలను కూడా ప్రారంభించాలని, తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని కెసిఆర్‌ తెలిపారు. గాలి, నీరు కలుషితం కాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని, పెద్ద మొత్తంలో మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *