రాష్ట్రపతిగా రేండేళ్లు పూర్తి చేసుకున్న ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ, జులై 25 : రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం నాటితో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. తనదైన శైలిలో పని చేసి ఆయన అందరి మన్ననలు పొందారు. రెండేళ్లు పదవి కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఆయన ఒక మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు.
రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసే ఈ మ్యూజియానికి ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రజలు సందర్శించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. వివిధ దేశాధినేతల నుంచి గత రాష్ట్రపతులు అందుకున్న బహుమతులు మొదలుకొని చారిత్రక ప్రాధాన్యం ఉన్న వస్తువులు, చిత్రపటాల వరకు ఎన్నింటినో అక్కడ ప్రదర్శిస్తారు. మొదట మూడు నెలలు ప్రజలకు దీనిని ఉచితంగా సందర్శించే అవకాం కల్పిస్తారు.
మరోవైపు గత రాష్ట్రపతులకు భిన్నంగా ఈ రెండేళ్లలో ప్రణబ్ ముఖర్జీ ఎక్కువ కాలం రాష్ట్రపతి భవన్‌లోనే గడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపారు. ప్రణబ్ కంటే ముందు రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభాపాటిల్ తన ఐదేళ్ల పదవీ కాలంలో రూ. 223 కోట్లు ఖర్చుతో 23 దేశాలను సందర్శించి వచ్చారు. ప్రణబ్ మాత్రం ఈ రెండేళ్లలో బెల్జియం, టర్కీ, దక్షిణాఫ్రికాలో మాత్రమే పర్యటించారు.