అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యత అధినేతకు
ఖమ్మం,ఆగస్ట్1: ఖమ్మం జిల్లా పరిషత్ ఎన్నిక ప్రకటించడంతో ఇప్పుడు ఛైర్మన్ ఎవరన్నది చర్చ మొదలయ్యింది. టిడిపిలో వర్గవిభేదాల కారణంగా ఏకాభిప్రాయం కుదిరే అవకాశంలేకుండా పోయింది. దీంతో పంచాయితీని బాబు ముందు పెట్టి తేల్చుకోవాలని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. అధ్యక్ష పీఠం దక్కించుకునే బలం తెదేపాకు ఉంది. కానీ పార్టీలోని వర్గపోరు అధ్యక్ష పదవి అభ్యర్థి ఎంపిక పట్ల ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఖమ్మం జడ్పీ అధ్యక్ష పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయింది.జిల్లాలో 39 జడ్పీటీసీ స్థానాల్లో టిడిపి 19 స్థానాలు గెల్చుకుంది. దీంతో మెజార్టీ రావడంతో జడ్పీ టిడిపికి దక్కనుంది. గెలుపొందిన 19 మంది సభ్యులను శనివారం పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు జిల్లా నేతలు తీసుకెళ్లనున్నారు. వీరితో చంద్రబాబు విస్తృతంగా చర్చించి అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. పేరు ఖరారు కాగానే ఆ రోజు నుంచి జడ్పీటీసీ సభ్యులతో ప్రత్యేకంగా రహస్య క్యాంపు నిర్వహిస్తారని సమాచారం. 7వ తేదీ ఉదయం జడ్పీటీసీ సభ్యులందరినీ ఖమ్మం తీసుకొచ్చి జడ్పీ అధ్యక్ష ఎన్నికలో పాల్గొనేలా పథకం రూపొందించినట్లు తెలిసింది. అయితే అధ్యక్ష అభ్యర్థి ఎవరనేది ఎన్నిక రోజు ఉదయమే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల అభ్యర్థులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ అధ్యక్షుడు మువ్వా విజయ్‌బాబు సహా జడ్పీటీసీ సభ్యులు హైదరాబాద్‌లో శనివారం చంద్రబాబు నాయుడును కలవనున్నారు. జడ్పీటీసీ ఎన్నికలకు ముందు కొత్తగూడెంకు చెందిన గడిపల్లి కవితను అధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టాలని పార్టీ అధినేత చంద్రబాబు వద్ద సండ్ర వెంకటవీరయ్య, తుమ్మల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణలు ప్రతిపాదించి ఒప్పించారు. గతంలో కొత్తగూడెం మున్సిపల్ అధ్యక్ష ఎన్నికకు పోటీ పడి ఓటమి చెదిన విద్యాధికురాలు కవితకు అవకాశం కల్పించి న్యాయం చేయాలని కోరారు. అప్పట్లో వారి సూచనను ఆయన అంగీకరించారు. కొత్తగూడెంకు చెందిన కవిత వెంకటాపురం మండలంలో జడ్పీటీసీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇదిలా ఉంటే మరోవైపు నామా నాగేశ్వరరావు వర్గానికి చెందిన తుళ్లూరి బ్రహ్మయ్య అశ్వాపురం మండలంలో తోకల లలితను ఎన్నికల్లో నిలిపి గెలిపించారు. నామా నాగేశ్వరరావు ద్వారా తోకల లలితకు జడ్పీ అధ్యక్ష పదవి కోసం పట్టుపడుతున్నారు. ఏన్కూరు నుంచి జడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన కోపెల శ్యామల పేరును ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు తాజాగా తెరపైకి తెచ్చారు. వీరితోపాటు చర్ల నుంచి జడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన మరో మహిళ జడ్పీ పఠం కోసం పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో జడ్పీ అధ్యక్ష పదవికి అభ్యర్థి పేరు ఖరారు చేసేందుకు తెదేపా నేతలు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్లనున్నారు.




