వివరాలు సేకరిస్తున్న అధికారులు
నల్లగొండ,ఆగస్ట్ 1: జిల్లాలో వేల సంఖ్యలో అక్రమ సర్వీసుల ద్వారా విద్యుత్తును వాడుకుంటున్న విషయాన్ని విద్యత్ అధికారులు గుర్తించారు. వీరి వివరాలును సేకరిస్తున్నారు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో వాటి సంఖ్య ఏటా పెరుగుతోంది. అక్రమ విద్యుత్తుతో 32 వేల వ్యవసాయ బోరు బావులు నడుస్తున్నాయని గుర్తించినట్లు సమాచారం. పొలాల్లో విద్యుత్తు లైన్లకు కర్రలతో కొక్కెలు తగిలించి యథేచ్చగా విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్నారని గుర్తించిన అధికారులు వారి వివరాలును సేకరిస్తున్నారు. అదే విధంగా గృహాలకు కూడా అక్రమ వినియోగం అధికంగానే ఉంది. ఇష్టారాజ్యంగా అక్రమంగా ఇళ్లకు విద్యుత్తు వినియోగిస్తున్నారు. అక్రమ విద్యుత్తు కనెక్షన్ల వినియోగం తగ్గించేందుకు విద్యుత్తు శాఖ నడుబింగించింది. ఒక పక్క విద్యుత్తు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తు పూర్తిస్థాయిలో అదుపు చేయలేకపోతున్నారు. క్షేత్రస్థాయి అధికారులైన ఏఈలకు అక్రమంగా విద్యుత్తు వినియోగిస్తున్న వారిపై కేసుల నమోదు లక్ష్యం విధించారు. అక్రమాల గట్టురట్టు చేసేందుకు విద్యుత్తు ఉద్యోగులు రంగంలోకి దిగారు. ప్రతి నెల ఒక ఏఈ విధిగా 25 కేసుల చొప్పున నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్రమ వినియోగదారులపై కొరడా ఝలిపించేందుకు చర్యలు ప్రారంభించారు. అక్రమ వినియోగానికి పాల్పడినట్లు రుజువైతే కేసు నమోదుతోపాటు భారీగా జరిమానాలు విధించనున్నారు. ఓ వైపు విద్యుత్తు కొరతతో విద్యుత్తు శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. మరోవైపు అక్రమ విద్యుత్తు వాడకంతో సంస్థ నష్టాల బాట పడుతోంది. ఫలితంగా అసలైన విద్యుత్తు వినియోగదారులకు విద్యుత్తు వెతలు తప్పడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది అక్రమార్కులకు వంత పాడుతుండడంతో ఏటా 14 శాతం ఆదాయాన్ని సంస్థ నష్టపోతోంది. విద్యుత్తు నష్టాన్ని నివారించేందుకు దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ అధికారులు చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా అక్రమ సర్వీసులపై దృష్టి సారించారు. జిల్లాలో సర్వీసుల వారిగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా అధికారులకు సంస్థ ఆదేశాలు జారీ చేసింది.అధికారికంగా అన్నీ కలుపుకొని 11 లక్షలకు పైగా విద్యుత్తు సర్వీసులున్నాయి. వీటికి తోడు అనధికారికంగా 40 వేల కనెక్షన్లు ఉన్నాట్లు అ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వీటి ద్వారా సుమారు నెలకు రూ.30 లక్షల వరకు సంస్థ ఆదాయం నష్ట పోతున్నట్లు ఉన్నతాధికారులు అంచనా వేసి నష్టాలకు నివారించాలని డివిజన్ స్థాయి అధికారులను బాధ్యులుగా చేసింది.




