Monday, 2 November 2026

పాల ఉత్పత్తితో మహిళలకు ఉపాధి

నిజామాబాద్‌,ఆగస్ట్‌ 1: జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని మంత్రి పోచారం అధికారులను ఆదేశించారు. పాల ఉత్పత్తి ద్వారా మహిళలకు ఆర్థికంగా ఎదిగేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. పాలకు మంచి ధరతో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రణాళికను సిద్ధం చేయాలని, ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో రోజుకు సుమారు 25 లక్షల లీటర్ల పాలు అవసరం ఉంటే ప్రభుత్వం నుంచి నాలుగు లక్షల లీటర్లే అందుతోందన్నారు. ఇందులో సగం కర్ణాటక రాష్ట్రం నుంచే వస్తుందన్నారు.  ఇచ్చిన హావిూ ప్రకారం రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. అనర్హులను తొలగించి అర్హులకు అందిస్తామన్నారు.  సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. నిధులు రాక నష్టపోయామన్నారు. దసరా నుంచి వృద్ధులకు రూ.1000లు, వితంతులకు రూ.1500ల పింఛన్‌ అందిస్తామన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.5 లక్షల వరకే రుణాలు అందిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వంలో రూ.10 లక్షలకు దీనిని పెంచుతామని, ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు  మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో మహిళలు భర్తల వద్ద అవసరాల నిమిత్తం డబ్బులు అడిగేవారని, ప్రస్తుతం ఇది మారిందన్నారు. భర్తలే భార్యలను డబ్బులు అడిగే రోజులు వచ్చాయన్నారు. గృహనిర్మాణం కోసం రూ.3 లక్షలతోపాటు అదనంగా మరో రూ.50వేలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంతకు ముందు తెలంగాణ అమరవీరులకు, మృతిచెందిన పాఠశాల విద్యార్థులకు శ్రద్దాంజలి ఘటించారు. ఈ సమావేశంలో జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఐకేపీ పీడీ వెంకటేషం, ప్రాంతీయ సమన్వయకర్త రవీందర్‌, ఏపీఎం శిరీషా, నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *