సంగారెడ్డి,ఆగస్ట్1: జిల్లాలో కొల్చారం మండలం మినహా మిగతా అన్ని మండలాల్లో 51 చెరువులు, కుంటలను గొలుసుకట్టు కింద అభివృద్ది చేయనున్నారు. ఈ మేరుకు చెరువుల అభివృద్దిని గుర్తించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా గొలుసుకట్టు విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సంగారెడ్డిలోని నీటిపారుదల శాఖ డివిజన్ పరిధిలో 27, మెదక్‌లో 10, సిద్దిపేటలో 14 చెరువులు, కుంటలను ఇందుకు ఎంపికచేశారు. వీటి వివరాలను భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దృష్టికి తీసుకువెళ్లి ఆమోదింపజేసేలా ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే భూమి లేని నిరుపేద ఎస్సీ లబ్దిదారులను గుర్తించి వారికి భూములు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు కార్యక్రమం జరుగుతోంది. నిరుపేద ఎస్సీ కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం మూడు ఎకరాల సాగు భూమిని అందజేయాలని నిర్ణయించింది. వీరికి ప్రభుత్వ భూములు లేనందున ఇతర రైతుల వద్ద కొనుగోలు చేసి అందజేస్తామన్నారు. ముందుగా నీటి సౌకర్యం ఉన్న ప్రాజెక్టు కాల్వలు, చెరువుల కింద, బోరు బావుల సవిూపంలోని భూములకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. భూములు విక్రయించేందుకు రైతులు ముందుకు వస్తే వాటిని సర్వే చేస్తున్నారు. ముందుగా భూమి లేని నిరుపేదలకు అవకాశం కల్పిస్తామని, రెండో విడతలో కొద్దిగా భూమి ఉన్న వారికి వర్తింపజేస్తామన్నారు.




