ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం స్థితిగతులను నమోదు చేస్తారని, ఈ డేటాను కంప్యూటరీకరించి సంబంధిత అధికారుల వద్ద అందుబాటులో ఉండే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇట్లా పకడ్బందీగా ప్రతి కుటంబం వివరాలు ప్రభుత్వం వద్ద ఉంటే సంక్షేమ పథకాల నిధులు అక్రమార్కులు, పైరవీ కారుల జేబుల్లోకి వెళ్లకుండా అరికట్టవచ్చని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులకే అందించవచ్చని చెప్పారు. కుటుంబాల సూక్ష్మ స్థాయి సర్వే సన్నాహక సదస్సులో అధికారులనుద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. మండల స్థాయి ఎంఆర్‌ఓ, ఎండీఓ దగ్గర్నుంచీ జిల్లా స్థాయి కలెక్టర్‌వరకు ఎలాంటి తప్పుడు లెక్కలు, ధృవీకరణ పత్రాలు ఇచ్చి అవకతవకలను పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు కొంచెం కష్టమైనా సరే అధికారలు చిత్తశుద్ధితో సహకరించాలని కోరారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సర్వేలు సరిగ్గాలేవు. ఒక్కో సర్వే ఒక్కో రకంగా ఉంటది. సరైన లెక్కలు లేకపోవడంతోనే కుంభకోణాలు జరుగుతున్నాయి. ఆశించిన స్థాయిలో పేదరిక నిర్మూలన జరగటం లేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రజలకు చాలా ఆశలు ఉన్నయి. సర్వేలు మొక్కుబడిగా చేస్తే ప్రయోజనం ఉండదని సీఎం పేర్కొన్నారు.
86 లక్షల కుటుంబాల గణన ఒకే రోజు నిర్వహిస్తాం
హైదరాబాద్: రాష్ట్రంలో 86 లక్షల కుటుంబాల గణన ఒకే రోజు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సర్వే కోసం అన్ని వనరులను ఉపయోగించుకుంటామని చెప్పారు. రాష్టంలో ఆర్టీసీ బస్సులు సహా లారీలు, ఆటోలు వంటి వాహనాలను సర్వేకోసం వెళ్లే అధికారులను ఆయా గ్రామాలకు తరలించడానికి ఉపయోగిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో 84 లక్షల కుటుంబాలు ఉంటే … కోటీ 7 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం కింద ప్రభుత్వం మీద 4 వేల కోట్ల భారం పడుతుందన్నారు.
ప్రతి దానికి వైట్ రేషన్ కార్డునే లింక్ పెట్టిన్రు. 55 లక్షల ఇండ్లు కట్టించినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. గృహనిర్మాణ రంగంలో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. అర్హులకు పించన్లు ఇస్తమని, ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. ప్రాణం పోయినా అనర్హులకు రేషన్ కార్డు ఇవ్వమన్నారు.





