
మందులకు కాలం చెల్లిపోతుందేమో కాని రాజకీయ వారసత్వానికి కాదు! అయితే తండ్రి అడుగుజాడల్లోనే రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని అదే పార్టీలో కొనసాగడం సాధ్యమేనా? ఈ ప్రశ్నకు కాదనే సమాధానం చెప్పుకోవాలి. తన జీవితాంతం కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని, అందులోనే ఎదిగిన వ్యక్తి దివంగత కార్మిక నాయకుడు, మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి. తండ్రి మరణానంతరం ఆయన తనయుడు విష్ణువర్దన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండి జూబిలీ హిల్స్ ఎమ్మెల్యేగా ఒక పర్యాయం ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైన విష్ణు ప్రస్తుతం ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే ఆయన సోదరి విజయారెడ్డి మాత్రం తన తండ్రి నమ్ముకున్న పార్టీని కాక అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తన తండ్రి ఫోటోతో వైఎస్ఆర్ అభ్యర్థిగా పోటీ చేసినా ఆమెను విజయం వరించలేదు. కాగా, ఇప్పుడు టిఆర్ఎస్‌లో చేరిన విజయారెడ్డి తన తండ్రి ఫోటోను అక్కడకు కూడా తీసుకెళ్లారు. మొత్తమ్మీద కాంగ్రెస్ పార్టీకి పూర్తి విధేయునిగా మరణించే వరకు కొనసాగిన పిజెఆర్ ఫోటో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో దర్శనమివ్వడం ఆయన అభిమానులకు మింగుడుపడని విషయమే! మరి వారసులకు ఇది అర్థమవుతుందా?