Tuesday, 3 November 2026

ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ప్రజల న్యాయసమ్మతమైన కోరిక

 తెలంగాణ సాధనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది : తూర్పు, దక్షిణ భారతాల్లో బీజేపీ జెండా ఎగరాలి:అమిత్‌షా

 హైదరాబాద్, ఆగస్టు 21 : ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ప్రజల న్యాయసమ్మతమైన కోరిక అని, దానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను బీజేపీ సర్కార్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విభజన చేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో యుపీఏ ప్రభుత్వం మాత్రం రెండు రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య చిచ్చుపెట్టిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అమరవీరులకు అమిత్ షా బీజేపీ తరఫున నివాళులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖరావులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

నిజాం నియంతను తరిమికొట్టిన ఘనత వల్లభాయ్ పటేల్‌దేనని, పటేల్ లేకుంటే భారత్‌లో హైదరాబాద్ విలీనం అయ్యేదికాదని అమిత్ షా అన్నారు. సర్దార్ పటేల్ ఏ లక్ష్యాన్నైతే ప్రారంభించారో దానిని ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ వికాసానికి అందరూ కృషి చేయాలని, తూర్పు, దక్షిణ భారతాల్లో బీజేపీ జెండా ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు. నిత్యం జనం మద్య ఉండే నాయకుడే మోదీ అని అయన అన్నారు. ప్రధాని ఎర్రకోట ప్రసంగం దేశంలోని ప్రతి హృదయం తలుపు తట్టిందని అమిత్ షా తెలిపారు.

సమస్యల పరిష్కారానికి ప్రధాని మోదీ వద్ద పక్కా ప్రణాళిక ఉందని అమిత్ షా చెప్పారు. ప్రతి ప్రజా ప్రతినిధి తన నియోజక వర్గంలో ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయాలని నరేంద్రమోదీ సంకల్పించారని ఆయన అన్నారు. యూపీఏ పాలన కుంభకోణాల మయమని, కుంభకోణాలతో యూపీఏ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టు పట్టించిందని ఆయన మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *