హైదరాబాద్; ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులకు సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. నేరస్తులు, క్రిమినల్ రికార్డులు ఉన్నవారిని మంత్రులుగా తీసుకోరాదని కోరింది. తన ప్రభుత్వంలో ఎవరిని మంత్రులుగా నియమించాలో ఆ మేరకు నిర్ణయించుకునే అధికారం ప్రధానికి ఉన్నప్పటికీ కళంకితులను, అవినీతిపరులను మంత్రులుగా తీసుకోరనే తాము ఆశిస్తున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని 75వ అధికరణం కింద ప్రధానమంత్రికి అధికారం ఉన్నా, కళంకిత మంత్రులను అనర్హులుగా ప్రకటించాలని నిర్దేశించే ఎలాంటి నిబంధననూ దీనికి చేర్చజాలమని కోర్టు స్పష్టం చేసింది. ఏది ఏమైనా చట్టానికి తూట్లు పొడిచేవారికి కీలకమైన పదవులు ఇవ్వరాదని అభిప్రాయపడింది. క్రిమినల్ కేసులు ఉన్నవారిని మంత్రులుగా తీసుకోవచ్చా అని ప్రశ్నిస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ని కోర్టు విచారించింది. అలాంటివారిని మినిస్టర్లుగా నియమించ రాదన్న ఆ పిటిషన్‌ని తోసిపుచ్చింది.




