హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత నిర్వహించే ప్రతి పండుగ ప్రత్యేకమైనదేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు భరత్ భూషణ్ వేసిన చిత్రాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. బతుకమ్మపై భరత్ భూషణ్ వేసిన చిత్రాలు ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని కవిత అన్నారు. పండుగలు, సంస్కృతి సైతం ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఉద్యమ స్వరూపాలుగా మారాయని అభిప్రాయపడ్డారు. అలాంటి పండుగలను మరింత ఉత్సాహంగా, వైభవంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఛాయాచిత్రాలు, ప్రదర్శనలు దేశ విదేశాల్లో జరపాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రభుత్వం సహకారం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పురాతన ఛాయాచిత్రాలను భవిష్యత్తు తరాలకు అందించే విధంగా పునరుద్ధరించాల్సి ఉందని ఆమె చెప్పారు.




