హైదరాబాద్: ఇటీవలే ఢిల్లీ జూలో యువకుడిపై పులి దాడి చేసి చంపిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి పులితో పోరాడి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్ సమీపంలోని కమాదా గ్రామంలో ఇంట్లోకి చొరబడిన చిరుతపులితో కేవలానంద అనే వ్యక్తి వీరోచితంగా పోరాడి తన భార్య, బిడ్డలను కాపాడుకున్నాడు. గ్రామంలో అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో ఓ చిరుత కుక్కను వెంటాడుతూ కేవలానంద ఇంట్లోకి ప్రవేశించింది. ఆ సమయంలో ఇంట్లో అతడితోపాటు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. చిరుత పిల్లలపై దాడి చేసేందుకు యత్నించగా అతడు అడ్డుకొని చిరుతతో పోరాటానికి దిగాడు. ఎన్ని గాయాలైనా పిల్లలపై చిరుతను దాడి చేయనీయలేదు. ఇంతలో ఇంట్లో వాళ్లు గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్థులు పరిగెత్తుకు వచ్చారు. జనాలు గుమిగూడడంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిరుత దాడిలో కాళ్లు, చేతులు, వీపు భాగంలో తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.




