Monday, 2 November 2026

ముంచుకొస్తున్న తుపాను ముప్పు

2

అధికారులు అప్రమత్తం

భారీగా ఈదురుగాలు వీస్తాయి

వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్‌/విశాఖపట్టణం, అక్టోబర్‌ 10 (జనంసాక్షి) : తుపాను ముప్పు ముంచుకొస్తోంది. హుదూద్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. భారీగా ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల విపరీతమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందన్నారు. గాలుల తీవ్రతకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో అలలు రెండు విూటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశముంది. తుపాను ప్రభావం వల్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడం, విద్యుత్‌ స్తంభాలు విరగడం, రైలు, రోడ్డు మార్గాలు కొట్టుకుపోవటం, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశముంది. సముద్రంలో చేపల వేటను నిషేధిస్తూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బంగాళాఖాతంలో అంతకంతకూ బలపడుతున్న హుదూద్‌ పెను తుఫాన్‌ కోస్తాంధ్ర తీరంవైపు శరవేగంగా దూసుకొస్తున్నది. హుదూద్‌ అత్యంత ప్రమాదకరంగా మారుతున్నదన్న వార్తలతో ఆంధప్రదేశ్‌, ఒడిశా తీర ప్రాంతాలు చివురుటాకులా వణుకుతున్నాయి. తుఫాన్‌ కదలికలను అనుక్షణం గమనిస్తున్న భారత వాతావరణశాఖ, 12వ తేదీ మధ్యాహ్నంలోపు ఒడిశాలోని గోపాల్‌పూర్‌-ఆంధప్రదేశ్‌లోని విశాఖపట్టణం మధ్య తీరందాటే అవకాశాలున్నాయని తెలిపింది. దీంతో అప్రమత్తమైన ఆంధ్రా, ఒడిశా ప్రభుత్వాలు హై అలర్ట్‌ ప్రకటించాయి. కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి అజిత్‌సేథ్‌  విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో సమావేశమై పరిస్థితిని సవిూక్షించారు. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రా, ఒడిశా తీరాల్లోని నౌకాశ్రయాల్లో గురువారం 2వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయదిశలో 530, గోపాలపూర్‌కు దక్షిణ-ఆగ్నేయ దిశలో 570 కిలోవిూటర్ల దూరంలో హుదూద్‌ తుపాను కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్యదిశగా పయనించి మరో 12గంటల్లో తీవ్ర పెనుతుపానుగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం విశాఖపట్నం సవిూపంలో తీరందాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఈనెల 11వ తేదీ సాయంత్రం నుంచి తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 11వ తేదీ ఉదయం నుంచి తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోవిూటర్ల వేగంతో, 12వ తేదీ నుంచి 130-140కి.విూ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది.

నాలుగు విూటర్లు ముందుకొచ్చిన సముద్రం

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని తీరప్రాంత గ్రామమైన చింతపల్లిలో సముద్రం 4విూటర్ల ముందుకు రావడంతో మత్స్యకారులు ఆదోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో తీరం ఒడ్డున ఉన్న పడవలను, వలలను ఒడ్డుకు చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నా అధికారులు ఎవ్వరూ తమ గ్రామానికి రాలేదంటూ గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుదూద్‌ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్డీఆర్‌ఎఫ్‌ డీఐజీ గులెరియా తెలిపారు. ఇప్పటికే కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు 11బృందాలు అందుబాటులో ఉంచామని, మరో నాలుగు బృందాలు సాయంత్రంలోగా తరలిస్తామని తెలిపారు. అవసరమైతే నేవీ సహకారం తీసుకుంటామని, మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. శనివారం ఉదయం నుంచి సహాయక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *