ముంబై, అక్టోబర్ 10 (జనంసాక్షి) : మహరాష్ట్ర నుంచి కాంగ్రెస్ పార్టీని ఏ శక్తీ విడదీయలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. మహారాష్ట్రను కాంగ్రెస్ రహిత రాష్ట్రంగా మార్చాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంపై రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ను మహారాష్ట్ర నుంచి వెలివేయడం అసాధ్యమని ఆయన అన్నారు. రాష్ట్రానికి చెందిన మహానుభావులు శివాజీ, అంబేద్కర్, పూలే తదితరుల ఆదర్శాలు.. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఒక్కటేనని రాహుల్ పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ రాహుల్ ఓ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ భాజపా నేతలపై ధ్వజమెత్తారు. కేంద్రంలోని ప్రభుత్వం పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందన్నారు. మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడానికి ముందు.. అక్కడి నుంచి వచ్చిన ఓ పారిశ్రామికవేత్తల బృందం ఇక్కడ ప్రధానిని కలిసి ఔషధాల ధరలపై ఉన్న నియంత్రణను ఎత్తివేయాలని కోరిందన్నారు. దీనిపై అంతర్లీనంగా ఒప్పందం కూడా కుదిరిందని.. ఇది అమల్లోకి వస్తే ప్రస్తుతం రూ.8వేలకు లభిస్తున్న క్యాన్సర్ చికిత్స మందులు రూ.లక్ష చేరుకుంటాయని రాహుల్ తెలిపారు. ప్రజల సొమ్మును పెద్దలకు దోచుపెట్టేవిధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.లోక్‌సభఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ దేశానికి మంచిరోజులు తెస్తాం..పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెబుతామని ఊదరగొట్టారన్నారు. ఇప్పుడేమో ఉల్లి ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా..పాక్ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నా త్వరలోనే అంతా సర్దుకుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని రాహుల్ ఎద్దేవాచేశారు.
మహరాష్ట్ర నుంచి కాంగ్రెస్‌ను ఏ శక్తీ విడదీయలేదు : రాహుల్





